Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలన్ని ఉంచాలి
- బడుల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలివ్వండి
- అధికారులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోటీపరీక్షలకు సమాయత్తం అవుతున్న నిరుద్యోగులకు అండగా గ్రంథాలయాలను కొలువుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయాల పనితీరును ఆమె సమీక్షించారు. నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలన్నింటినీ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. పోటీపరీక్షలు పూర్తయ్యే వరకూ రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నీ రోజూ పనిచేయాలని కోరారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు, శాఖ గ్రంథాలయాలు ఉదయం ఎనిమిది నుంచి 11 వరకు, మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పోటీపరీక్షల నేపథ్యంలో గ్రంథాలయాలకు వస్తున్న వారి సంఖ్యకు అనుగుణంగా అదనపు సౌకర్యాలు సమకూర్చాలని కోరారు. ఆన్ డిమాండ్ బుక్ సిస్టమ్‌లో భాగంగా నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలను సూచిస్తే వాటిని కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. పోటీపరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలుగు అకాడమి పుస్తకాలు ఆవిష్కరించిన మంత్రి
తెలుగు అకాడమి ముద్రించిన పోటీపరీక్షలకు అవసరమైన 42 రకాల పుస్తకాలను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. పోటీపరీక్షలకు హాజరయ్యే వారికి ఈ పుస్తకాలు ఉపయుక్తంగా ఉండేలా అనుభవజ్ఞులైన నిపుణులతో రూపొందించామని వివరించారు. బుధవారం నుంచి ఈ పుస్తకాలు నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.