Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డంకులు రాకుండా ప్రభుత్వం కసరత్తు
- త్వరలో కేజీబీవీ ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు
- కొత్త జోన్ల ప్రకారం మోడల్ స్కూల్ టీచర్ల బదిలీల విధివిధానాలు
- విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి న్యాయపరమైన అవరోధాలు కలిగి ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో బదిలీల ప్రక్రియకు అడ్డంకులు కలగకుండా న్యాయశాఖ సలహా తీసుకుని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని వెల్లడించారు. ఈ విషయంపై అన్ని ఉపాధ్యాయ సంఘాలకూ పూర్తి అవగాహనను కలిగి ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యాయపరమైన వివాదాలు దాటుకుని అందరికీ బదిలీలు, పదోన్నతులు ఇచ్చేలా కసరత్తు జరుగుతున్న విషయంపై ఆయా సంఘాలకు అవగాహన ఉందని వివరించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి ఈ సమస్య పరిష్కారానికి కృషిచేయడం జరుగుతుందనీ, అందరూ సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టడానికి అన్ని రకాల చర్యలూ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలతోనూ పలుమార్లు చర్చించామని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఇతర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు సీఎం ఆదేశాలనుసారం బదిలీల ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అందుకు అనుసరించాల్సిన విధి, విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.
మోడల్ స్కూళ్లకు సంబంధించి ఇప్పటి వరకు బదిలీల ప్రక్రియ ఎప్పుడూ జరగలేదని ఆమె తెలిపారు. ఇటీవలే అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అధికారులతోనూ, ఉపాధ్యాయ సంఘాలతోనూ చర్చించామని పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జోనల్, మల్టీ జోనల్ మార్పులకు అనుగుణంగా అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారని వివరించారు. వాటికిలోబడి త్వరలోనే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. సీఎం ఆదేశాలతోనే వారికి సర్వీసు రూల్స్‌ను రూపొందించామని గుర్తు చేశారు.