Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు పథకంలో హర్యానా గేదెలు
- ఇక్కడి వాతావరణానికి సరిపడవంటున్న లబ్దిదారులు
- ఇందిరా క్రాంతి పథకంలో ఎదురైన అనుభవం
- తప్పదంటున్న ప్రభుత్వ అధికారులు
- డెయిరీ యూనిట్ షెడ్‌కు రూ.లక్షన్నర కేటాయింపు
- నత్తనడకన నిర్మాణాలు
ఎస్. వెంకన్న
'షెడ్డు నిర్మాణానికి లక్షన్నర సరిపోవటం లేదు. చేతి నుంచి మరో రూ.25వేలు తగిలనరు.షెడ్డు నిర్మాణానికి అంచనా వేసినప్పటికీ ి మెటీరియల్ ధరలకు..ఇప్పటి ధరలకు పొంతన లేదు. ఈ నాలుగైదు నెల్లలోనే బాగా ధరలు పెరిగినరు. అధికారులకు ఈ విషయం చెప్పినా..అంతే అంటున్నరు. గేదెలు వస్తయంటున్నరు. ఎప్పుడొస్తయో తెల్వదు'.
-ఎల్ సుగుణమ్మ, నర్సింహాపురం. చింతకాని మండలం.
'మన ప్రాంతం గేదెలయితేనే మనకు ఉపయోగం. ఖర్చు తక్కువ. ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. హర్యానా గేదెలకు ఖరీదు ఎక్కువ. ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేవు. ఆ గేదెల పాలు పితకటం కూడా అంత సులభం కాదు. ఈ విషయం ఇందిరా క్రాంతి పథకంలో నాడు చూశాము. పథకం లక్ష్యం నెరవేరాలంటే మన వాతావరణానికి తట్టుకునే గేదెలను ఇవ్వాలి. గొర్రెల పంపిణీలాగా కావొదు'్ద.
-జానకి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు
దళితబంధు పథకాన్ని ఆగస్టు16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే నెల నాలుగున యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిని దళిత బంధు పథకం కోసం ఎంపిక చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లోనూ పూర్తిస్థాయి పైలట్ ప్రాజెక్టుగా దళితబంధును అమలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారుల జాబితాలను ఫైనల్ చేశారు. హుజూరాబాద్‌నియోజకవర్గంతో పాటు వాసాలమర్రిలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. యూనిట్ల గ్రౌండింగ్ జరిగింది. లబ్ధిదారులకు తమకు నచ్చిన వ్యాపారం/యూనిట్ ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇటీవల 'నవతెలంగాణ ' ఖమ్మం జిల్లా చింతకానిలో పర్యటించిన సందర్భంగా దళిత బంధుకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి.
డెయిరీ ఫాం లబ్దిదారుల ఆందోళన..
దళిత బంధు పథకంలో భాగంగా డెయిరీ ఫాం ఎంపిక చేసుకున్న లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది. హర్యానా నుంచి ప్రభుత్వం గేదెలను విక్రయించి ఇక్కడ పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలవటంతో అధికారుల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో గేదెను లక్షకు కొనుగోలు చేసి తీసుకొచ్చినా..ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేవని చెబుతున్నారు. వారం పది రోజుల్లో పాలు ఇవ్వకుండా ఒట్టిపోతాయని తమ అనుభవంతో అధికారు లకు వివరించారు. అంతకు ముందు ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా హర్యానాకు చెందిన గేదెలను పంపిణీ చేసిన విషయాన్ని గర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగితే పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు.
షెడ్డు నిర్మాణానికి కూడా పైసలు సరిపోట్లే..
దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న చింతకాని మండలంతో పాటు ఇతర మండలాల్లోని పైలెట్ ప్రాజెక్టుల్లో కూడా డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఒక్కో పసుల దొడ్డికి రూ.లక్షన్నర చొప్పున కేటాయించారు. ఈ మేరకు అన్ని మండలాల నుంచి అంచనాలతో ప్రణాళికలు తయారు చేసి పంపారు. కానీ వాటిని వేసే నాటికి ఉన్న మెటీరీయల్ ధరలతో పోల్చితే.. ఇప్పుడు రేట్లు డబుల్ అయ్యాయనీ, దీంతో షెడ్డు నిర్మాణానికి లక్షన్నర సరిపోవటం లేదని లబ్దిదారులు చెబుతున్నారు. దీంతో సొంతంగా అప్పులు తెచ్చి చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
గేదెల కోసం ఎదురు చూపు..
చింతకాని మండలంలో 4,312 కుటుంబాలకు గాను, ఇప్పటి వరకు 429మంది డెయిరీ ఫాం యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. వీరు గేదెలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే.. షెడ్డు నిర్మాణం కోసం రూ.50వేలు గ్రౌండింగ్ అయ్యాయి. మిగతా లక్ష కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు మాత్రం అదిగో వచ్చే..ఇదిగో వచ్చే అని చెబుతున్నారు. మినీ డెయిరీ యూనిట్ కింద లబ్ధిదారులకు 10 నుంచి 12 పాడి బర్లు, ఒక షెడ్, బైక్ ఇవ్వాలని మొదట నిర్ణయించారు. రూ.10 లక్షల్లో రూ.10 వేలు బీమా పోను, మిగిలిన రూ.9.90 లక్షల నుంచి షెడ్ కోసం రూ.లక్షన్నర, బైక్ కోసం రూ.90 వేలు కేటాయించారు. మిగిలిన ఏడున్నర లక్షలకు ఎనిమిది బర్లు మాత్రమే వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో యూనిట్ కింద మొదటి విడత నాలుగు బర్లు ఇస్తున్నది. రెండో విడతలో వచ్చే గేదెలతో కలుపుకుని ఎనిమిది బర్లు ఒకే షెడ్డులో ఎలా ఉంటాయన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఈ సమస్యను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి ప్రభుత్వం ఏం చెబుతుందోనని ఎదురు చూస్తున్నారు.