Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పంచాయతీరాజ్'పై సీఎం కేసీఆర్
- ఢిల్లీ నుంచి అమల్జేస్తామనటం సరికాదని వ్యాఖ్య
- ఎండల వల్ల పల్లె, పట్టణ ప్రగతి వాయిదా
- వచ్చేనెల మూడు నుంచి ప్రారంభం
- ఉన్నతస్థాయి సమీక్షలో పలు అంశాలపై చర్చ-నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. జవహ ర్‌రోజ్‌గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. 'రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి.. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు...' అని ఆయన విమర్శించారు. 75 ఏండ్ల అమృత మహౌత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకొస్తున్నారు.. విద్య, వైద్యంతోపాటు ఇతర అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవానుకోవటం సమర్థనీయం కాదని సీఎం విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, వాటి కార్యాచరణ, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితరాంశాలపై ఈ సందర్భంగా ఆయన చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అనుకున్న ప్రకారం... ఈనెల 20 ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఎండల వల్ల వాయిదా పడ్డాయి. ఆయా కార్యక్రమాలను జూన్ మూడు నుంచి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. విధ్వంసానంతరం వ్యవస్థల పునరుద్ధరణ చాలా కష్టమైన పని అని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమని వ్యాఖ్యానించారు. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రి ఎర్రబెల్లిని అభినందించారు.ఎస్‌కేడే ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశించటం వల్ల దాని స్ఫూర్తి ధ్వంసమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితమైందని చెప్పారు.
పద్మ శ్రీ తిమ్మక్కకు ఘన సన్మానం :
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకురాలు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 యేండ్ల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు తిమ్మక్కను సీఎం పరిచయం చేశారు. వారందరి సమక్షంలో ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తిమ్మక్క మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.ఆయన సారథ్యంలో రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
'ఆకుపచ్చని వీలునామా' పుస్తకావిష్కరణ
సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం.. 'ఆకుపచ్చని వీలునామా' పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తొలి కాపీని తిమ్మక్కకు అందజేశారు.