Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖిలా వరంగల్‌లోని జక్కలోద్ది, బెస్తం చెరువుల్లో వెలిసిన పదివేల గుడిసెలు
- 60 ఎకరాల్లో 25 వేల మంది జనం
- బెదిరిస్తే భయపడమని తెగేసి చెప్పి జనం
నవతెలంగాణ- వరంగల్/ఎన్‌జీఓస్ కాలనీ
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్‌లోని జక్కలోద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెల జాతర షురూ అయ్యింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 25 వేల మంది ప్రజలు ఈ రెండు ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో సుమారు పదివేల గుడిసెలను ఒక్క పూటలోనే నిర్మించారు. సీపీఐ(ఎం) రంగసాయిపేట ఏరియా కమిటీ పిలుపునందుకుని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ భూముల మీదికి పేదలు చేరుకున్నారు. పిల్లా పాప, యువతీ యువకులు, మహిళలు, పురుషులు, వృద్ధుల సహా తలదాచుకునేందుకు జాగా కోసం సద్ది మూటతో వచ్చారు. కొంతమందైతే వంట సామాగ్రి తెచ్చుకొని అక్కడే వండుకున్నరు. గుడిసెలు వేసుకున్నారు. మధ్యాహ్నం కల్లా ఈ రెండు ప్రాంతాల్లో గుడిసెల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వాస్తవానికి గతంలోనే ఇక్కడ గుడిసెలు వేసినప్పుడు పోలీసులు వాటిని కూల్చివేశారు. ఆ సందర్భంగా పోలీసులు, రెవెన్యూ అధికారుల సూచన మేరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జాబితాను సేకరించి ఎమ్మార్వో కు అందజేశారు. ప్రభుత్వం నుంచి 'ఆలోచించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామ'ని సమాధానం రావడంతో 'మీ పని మీరు చేయండి మా పని మేం చేస్తాం' అని పేదలు అప్పుడే బదులిచ్చారు. దీని కొనసాగింపుగానే మంగళవారం ఉదయం మూడు గంటల నుండి పేదలు గుడిసెలు నిర్మాణాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక సిఐ, ఎమ్మార్వో గుడిసెలవద్దకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని బెదిరించారు. 'గతంలో మీరు చెప్పినట్టే మేం చేశాం. దరఖాస్తులు ఇచ్చాం. మీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడు మా పని మేం చేస్తున్నాం. మీరు బెదిరిస్తే మేము పోము. భయపడేది ఏమీ లేదు' అని పేదలు వారిని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్, రంగ సాయి పేట ఏరియా కార్యదర్శి సాగర్ గుడిసెల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇరవై ఏండ్ల క్రితం మే 18 వ తేదీన గుడిసెల పోరాటంలో అమరుడైన రామ సురేందర్ స్ఫూర్తితో పోరాటంలోకి దిగాలని అని ప్రజలకు నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదేలు, ప్రశాంత్, నాగలక్ష్మి, మీరునిషా రమేష్, శ్రీనివాస్, మాధవి, చందు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
గోపాలపురంలో గుడిసెలను కూల్చి కాల్చివేసిన పోలీసులు
హనుమకొండ మండలం గోపాలపురం ప్రభుత్వ చెరువు శిఖంలో సుమారు వెయ్యి మందికి పైగా పేదలు వేసుకున్న గుడిసెలను మంగళవారం ఉదయం పోలీసులు కూల్చి కాల్చివేశారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు కూల్చివేసినట్టు పేదలు మండిపడ్డారు. ఇల్లు కిరాయిలు కట్టలేక ప్రభుత్వ చెరువు శిఖం భూమిలో సొంత ఇల్లు లేని నిరుపేదలు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు చెందినవారు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకుంటే సహించలేని ప్రజాప్రతినిధులు రెవెన్యూ, పోలీసులను ఉసిగొల్పారని, పేదల ఇండ్లను కూల్చివేసి, కాల్చి బూడిద చేయించిన హన్మకొండ, వర్ధన్నపేట ఎమ్మెల్యేల దుశ్చర్యలను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు మేధావులు తీవ్రంగా ఖండించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చుక్కయ్య, ఉప్పలయ్య విజ్ఞప్తి చేశారు.
దీనికన్నా ముందు తెల్లవారుజామున 3 గంటలకు సీపీఐ(ఎం) నాయకులు ఇండ్లపై పోలీసులు దాడిచేశారు. భూ పోరాట కమిటీ కన్వీనర్ ధరావతు బాలునాయక్ ను అరెస్టు చేసి కేయూ పోలీస్ స్టేషన్ లో బంధించారు, నాయకుల ఇండ్లల్లో సోదాలు చేశారు దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య, ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వానికి అప్పజెప్పిన చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ నాయకులను నిర్దాక్షిణ్యంగా కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వము, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములను అక్రమించి కబ్జా చేస్తూ అమ్ముకుంటున్న భూ బకాసురులు, రియాల్టర్లపై అధికార బలాన్ని ఉపయోగించాలని, పేదలపై కాదని ధరావత్ భాను నాయక్ హెచ్చరించారు.