Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రైతులకు టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా, తెలంగాణలో తక్కువగా ఉన్నాయని పార్లమెంటులో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ సమాధానమిచ్చారని గుర్తుచేశారు. రైతు బీమా పరిహారాన్ని 80 వేల మందికి ఇచ్చామనీ, అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్న వారు కాదనీ, ఇందులో సహజ మరణం పొందినవారు కూడా ఉన్నారని వివరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు మూసేశారనీ, సభా సంఘం వేసినా తెరవలేకపోయింది కాంగ్రెస్ సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.
ఎంత లేపినా కాంగ్రెస్ లేవదు
కాంగ్రెస్ పార్టీని ఎంత లేపాలనుకున్నఅది లేవదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బాబు విమర్శించారు. పిచ్చి మాటలు మానుకోకపోతే రేవంత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. వరంగల్‌లో సభ ఎవ్వరి డబ్బులతో పెట్టారో తమకు తెలుసని ఆరురి అన్నారు.