Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ల్యాబ్ టెక్నీషియన్ల హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వైద్యారోగ్య అనుబంధ వత్తుల పరిపాలన సంస్థ(తెలంగాణ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ - టీఎస్‌ఎహెచ్‌సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిల్ నిర్వహణ కోసం నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ విజరు కుమార్ చైర్మెన్‌గా, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, గాంధీ మెడికల్ కాలేజీ ప్యాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవోజీ మాలోత్‌లను ఎక్స్-అఫిషియో సభ్యులుగా నియమించింది. కౌన్సిల్ ఏర్పాటు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కౌన్సిల్ ఏర్పాటుతో వైద్యారోగ్య అనుబంధ వృత్తుల సమగ్రాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం రవీందర్ మాట్లాడుతూ ఇటీవల పార్లమెంటులో వైద్యారోగ్య అనుబంధ వృత్తుల బిల్లు చట్ట రూపం దాల్చడంతో జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమమయిందని తెలిపారు. దీంతో ఇక మీదట శిక్షణ పొందిన సాంకేతక నిపుణులు మాత్రమే ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందనీ, తద్వారా మెరుగైన రోగ నిర్ధారణ పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యావకాశాలు మెరుగు పడతాయనీ, డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయనీ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. శిక్షణ పొందకుండా వివిధ ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్న సాంకేతిక నిపుణులను ఆపేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ కమిషన్ ద్వారా వైద్య అనుబంధ వృత్తుల వారి నమోదు, గుర్తింపు, నియంత్రణ సాధ్య పడుతుదన్నారు. కొన్నేండ్లుగా కౌన్సిల్ ఏర్పాటు కోసం అసోసియేషన్ పోరాడిందని గుర్తుచేశారు.