Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల సాధనకు ఉద్యమించాలి : గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
నవ తెలంగాణ-కొమురవెల్లి
అక్రమాలకు తావులేకుండా గొర్రెలు పంపిణీ, హక్కుల సాధనకు ఉద్యమించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన కొమురవెల్లిలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా కన్వీనర్ ఆలేటి యాదగిరి అధ్యక్షతన సోమవారం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సిద్దిపేట జిల్లా మహాసభ నిర్వహించారు. అంతకుముందు కొమురవెల్లిలో గొల్ల కురుమలు డోలు, గొంగళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో గొల్ల కురుమలకు గొర్రెల పథకం ద్వారా ఇవ్వాల్సిన జీవాలు మొదటి విడత పూర్తి కాకపోగా, రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేకూరుతున్నదని తెలిపారు. 50ఏండ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.ఐదు వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. ప్రమాదంలో చనిపోయిన పెంపకందారులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి గొర్రెలకాపరికి రూ. లక్షతో షెడ్డు నిర్మించాలని, రూ.30 లక్షల రుణంతో గొర్రెల ఫారం ఏర్పాటు చేయాలని, గొర్రెలకు ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. ప్రతి గ్రామ సొసైటీకి కమ్యూనిటీ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. మహాసభలో జిల్లా కో కన్వీనర్ దాసరి బాలరాజు, సర్పంచ్ల ఫోరం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత, సంఘం జిల్లా నాయకులు గంగుల మధు యాదవ్, సంగెం పరశురాములు, కర్రే నర్సింలు, కొండయ్య, ఎగూర్ల రాజయ్య, గంగుల మల్లయ్య, బియ్యా సిద్ధులు, బొడపట్ల సత్తయ్య, మీసం మల్లయ్య, జక్కుల తిరుపతి, ఇరుమళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.