Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయానికి అనుసంధానించాలి
- రూ.97.35 లక్షల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి
- ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో తీర్మానం : మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి పనులకు అవకాశం కల్పించాలని. పెండింగ్ బిల్లు రూ. 97.35లక్షల కోట్లు వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్లు అందె యాకయ్య, సద్గుణ రవీందర్, వెంకటనారాయణగౌడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చోంగ్తు, కమిషనర్ శరత్, ఈజీఎస్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, ఇఎన్‌సీ సంజీవరావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ఉపాధి హామీ నిధుల్లో కోత విధించకుండా, గత ట్రాక్ రికార్డు ఆధారంగా, ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పనిదినాలను ఆమోదించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఉపాధిహామీకి కోత పెట్టిందన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని, లేబర్ బిల్లులు కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్‌గా కూలీల అకౌంట్‌లలోకి పంపించడం అన్యాయమని విమర్శించారు.
పని జరిగే ప్రదేశాల ఫొటోలు పెట్టాలని కొత్త రూల్ కేంద్ర ప్రభుత్వం పెడుతోందని, ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 97.35లక్షల కోట్ల లేబర్ పేమెంట్ పెండింగ్‌లో ఉందన్నారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రూ. 18,30,01,380 కోట్లకు తగ్గించారన్నారు. సుమారు రూ. 500 కోట్ల కోత విధించడంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన డబ్బులు ఆలస్యమవుతున్నాయని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త గ్రామ పంచాయతీల భవనాలు, మౌలిక సదుపాయాల కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో వెయ్యి కోట్లు పెట్టారన్నారు. ఆదిమ తెగల గూడాల్లో రోడ్ల కోసం పంచాయతీరాజ్ శాఖ రూ. 70 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ రూ. 70 కోట్లు మొత్తం రూ. 140 కోట్లు రెడీగా ఉన్నాయని తెలిపారు. ఇవేగాక రాష్ట్రంలోని 2400 కొత్త గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు పంచాయతీరాజ్, రూ. 300 కోట్లు గిరిజన సంక్షేమ నిధులు ఇవన్నీ కలిపి త్వరలోనే గిరిజన, ఆదివాసీ గూడాల్లో తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతామని మంత్రులు వివరించారు. ఈ నిధులు వినియోగంపై ఎస్టీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం నిర్వహిస్తామని, అలాగే ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో భేటీ ఉంటుందని మంత్రులు తెలిపారు. ఈ లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు మంత్రులు వివరించారు.