Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు ప్రాక్టీస్ వద్దంటారు...
- ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు స్పెషలిస్టుల డైలమా
- మారుమూల ప్రాంతాల పేదలకు ఇబ్బందేనంటున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రభుత్వాస్పత్రులను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దుతాం. పేద ప్రజలకు ప్రయివేటుకు వెళ్లి డబ్బు కోసం ఇబ్బందులు పడే బాధ నుంచి పూర్తి తప్పిస్తాం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరమైన ఆధునిక పరికరాలను సమకూరుస్తాం. వైద్య పరికరాలు మరమ్మతుకు వస్తే జాప్యం జరగకుండా రిపేర్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.' ఇలా రకరకాల ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదే పదే వినిపిస్తుంటాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మొదలు ఉన్నతాధికారుల వరకు ఇవే మాటలు. అయితే ప్రతిభావంతులైన స్పెషలిస్టు సేవల విషయంలో మాత్రం కార్పొరేటుతో పోటీ పడటంలో సర్కారు దవాఖానాలు వెనుకబడుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లిస్తున్న జీతానికి, ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న దానికి భారీ వ్యత్యాసం ఉండటమే కారణమని డాక్టర్ల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 13 వేల పోస్టులను భర్తీ చేయనున్నది. కొత్తగా నియమితులు కానున్న డాక్టర్ల ప్రయివేటు ప్రాక్టీసును సర్కారు నిషేధించింది. దీనిపై డాక్టర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. ఈ చర్య పరోక్షంగా ప్రయివేటు, కార్పొరేటుకే లాభదాయకమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒకవైపు కార్పొరేటు, ప్రయివేటు ఆస్పత్రితో పోలిస్తే సగం కన్నా తక్కువగా జీతం ఆఫర్ చేయడం, ప్రయివేటు ప్రాక్టీస్‌ను నిషేధించడం, దానికి ప్రత్యామ్నాయంగా ఆదాయ పెంపును చూపించకపోవడం కూడా ప్రతిభావంతులైన డాక్టర్లు ప్రభుత్వ సర్వీసుల్లో చేరకపోవచ్చనే వాదన వినపడుతున్నది. దానికి బదులుగా ప్రయివేటు ప్రాక్టీస్‌ను ఒక ఆప్షన్‌గా డాక్టర్లకే వదిలిస్తే బాగుంటుందనే సూచన చేస్తున్నారు. సర్వీసులో చేరే ముందే ప్రయివేటు ప్రాక్టీసు చేస్తామని లేదా చేయబోమని డాక్టర్ల నుంచే అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని వివరిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ సర్వీసుకే పరిమితమయ్యే వారికి అందుకు తగినట్టు నాన్ ప్రయివేటు ప్రాక్టీస్ అలవెన్స్ ఇస్తే ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మారుమూల, గ్రామీణ ప్రభుత్వ సర్వీసుల్లో స్పెషలిస్టుల కొరత ఎక్కువగా ఉందనీ, ప్రభుత్వ ప్రయివేటు ప్రాక్టీసుపై నిషేధం నిర్ణయంపై పునరాలోచన చేయకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు ప్రాక్టీసును నిషేధించిన తర్వాత 20 మంది సీనియర్ వైద్యులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా చూడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
సరైన నిర్ణయం కాదు...
నూతనంగా నియమితులు కానున్న డాక్టర్లు ప్రయివేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హెల్త్‌కేర్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌డీఏ) అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. నోటిఫికేషన్ ఇచ్చినా సరే.... ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎవరూ చేరకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వచ్చే మారుమూల ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్టుల సేవలు లభించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు చివరికి పేద రోగులకు ప్రభుత్వ స్పెషలిస్టుల సేవలు అందుబాటులోకి రాకుండా చేస్తాయని తెలిపారు.
- డాక్టర్ కె.మహేశ్ కుమార్.