Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు బంధుకు కోతలు
- వ్యవసాయ భూముల్లోని పశువుల షెడ్లు, కల్లాలపై సర్వే
- సాగు భూముల్లో నుంచి తొలగింపు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఒకవైపు రియల్ భూములు, పారిశ్రామిక వేత్తల వేల ఎకరాల బీడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో రూ. లక్షలల్లో పంచిపెడుతోంది. అయితే సన్న, చిన్న కారు రైతుల వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న పశువుల షెడ్లు, ఫౌల్ట్రిపామ్‌లు, కల్లాల కోసం కేటాయించిన భూములకు రైతు బంధు నిలిపివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు త్వరలో పశువుల పాక, కల్లాలపై సర్వేలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాంతో సన్న, చిన్న కారు రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇచ్చే అత్తేసరు పెట్టుబడి సాయంలో మళ్లీ కోతలేందీ.. ప్రభుత్వం ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతుల్లో అత్యధికులు సన్న, చిన్న కారు రైతులే ఉన్నారు. పెద్ద మొత్తంలో భూములన్నీ బడా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6,05,704 మందికి పెట్టుబడి సాయం అందుతున్నట్టు వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సుమారు 50శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందుతున్నట్టు సమాచారం. రంగారెడ్డిజిల్లాలో 3,48,556 మంది, వికారాబాద్‌లో 2,57,148 మంది రైతు బంధు లబ్దిదారులున్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు పెరిగిన దృష్ట్యా పంట సాగు పెట్టుబడి పెంచాలనీ, రైతు సంఘాలు కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం సన్న, చిన్న కారుల రైతులకే కోతలు విధించే ప్రయత్నం చేస్తోంది. ఈ కోతలు రియల్ వ్యాపారుల భూములకు, పారిశ్రామిక వేత్తల బీడు భూములకంటే పెద్దగా నష్టం లేదు. కానీ వ్యవసాయానికి అనుబంధమైన పాడి పశువుల షెడ్ల నిర్మాణ స్థలం, ధాన్యం నూర్పిడి కల్లాల విస్తీర్ణంపై సర్వేలు చేసి రైతు బంధులో కోతలు విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సన్న, చిన్న కారు రైతులకు నష్టం వాటిల్లనుంది. రైతు బంధు పంపిణీ విషయంలో రైతుల భూములు సర్వేలు చేయాలంటే వేల ఎకరాల్లో బీడుగా ఉన్న భూముల వివరాలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ వ్యవసాయ భూములన్నీ రియల్ భూములుగా మారాయి. రియల్ భూములకు సైతం ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద రైతు బంధు డబ్బులు చెల్లిస్తోంది. అలాంటి భూములకు రైతు బంధు నిలిపివేసే ప్రయత్నం చేయకుండా వ్యవసాయానికి అవసరమైన పశువుల కోసం ఏర్పాటుచేసుకున్న షెడ్ల విస్తీర్ణానికి రైతు బంధు బంద్ చేస్తామని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సన్న, చిన్న కారు రైతుల పట్ల వివక్షకు దారి తీస్తుందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రైతు బంధులో కోతలొద్దు
నాకున్న రెండెకరాల్లో ఎకరంన్నర సాగు చేస్తున్నా. అర్దెకరంలో పశువుల కోసం కొట్టం వేసిన, గడ్డివాములు, వడ్లు అరబెట్టుకోవడానికి కల్లం కింద వదులుకున్నా. ఇప్పటి దాక రెండెకరాల భూమికి రైతు బంధు వచ్చేది. ఇతర అవసరాలకు వదిలిన భూములకు రైతు బంధు ఇవ్వకుంటే పంట పెట్టుబడికి తిప్పలు తప్పవు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి.
- లక్ష్మయ్య రైతు
రైతు బంధును నిలిపివేసేందుకు చేస్తున్న కుట్రలు మానుకోవాలి
ప్రభుత్వం సాగుకు అనువుగా లేని భూముల వివరాలను రెవెన్యూ అధికారులు, రైతుల నుంచి సేకరిస్తుంది. జిల్లాలో పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఉన్న వేల ఎకరాల బీడు భూములకు రైతు బంధు నిలిపివేయాలి. కానీ వ్యవసాయనికి అనుబంధమైన పశువుల పాకలు, గడ్డివావుముల కోసం విడిసి పెట్టిన భూములకు రైతు బంధు నిలిపివేసి సన్న చిన్న కారు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు.
-మధుసూదన్‌రెడ్డి , తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి