Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరంలో పలుచోట్ల ఏర్పాట్లు
- ట్రెండింగ్‌లో 'మోడీ గో బ్యాక్' ట్వీట్
- రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై నిలదీత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారని ఇక్కడకు వస్తున్నావంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 17 ప్రశ్నలు సందిస్తూ హైదరాబాద్‌లో కొందరు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్ర చర్చ నడుస్తున్నది. మోడీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? మోడీజీ వేరీజ్ ఐఐఎమ్ ఫర్ తెలంగాణ? ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకివ్వలేదు? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైంది? తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఎందుకు కేటాయించలేదు? పసుపు బోర్డు ఏది? మోడీజీ వేర్ ఈజ్ ఐటీఐఆర్ ఫర్ తెలంగాణ? నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏమైంది? మోడీజీ వై రిలీఫ్ ఫండ్స్ ఫర్ హైదరాబాద్ ఫ్లడ్స్ నాట్ గీవెన్? మిషన్ భగీరథకు ఫండ్ ఇవ్వాలని నిటిఅయోగ్ సూచించినా ఎందుకివ్వలేదు? మోడీజీ వేర్ ఈజ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫర్ తెలంగాణ? తెలంగాణ ఫార్మాసిటీకి ఆర్థిక సహకారం ఎందుకు చేయట్లేదు? డిఫెన్స్ కారిడార్ ఏమైంది? తెలంగాణకు నవోదయ విద్యాలయాలను ఎందుకు కేటాయించట్లేదు? పసుపు బోర్డు హామీ ఏమైంది? పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వరా? టెక్స్‌టైల్ పార్కులు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నలను సంధించారు. రైల్వే స్టేషన్ వద్ద ఖాజీపేటకు సంబంధించిన ప్లెక్సీలు, మూసీ వంతెనలు, ట్యాంక్‌బండ్‌కు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల జాతీయహోదాకు సంబంధించి, విద్యాసంస్థలు, వర్సిటీల వద్ద విద్యకు సంబంధించిన హామీలపై ప్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణకు ఎందుకొచ్చారంటూ వాటి ద్వారా నిలదీశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ట్విటర్‌లో 'మోడీ గో బ్యాక్' అనే ట్వీట్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
ఎర్రటెండలో తిప్పలు
ప్రధాని మోడీని స్వాగతించేందుకు బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సభకు వచ్చిన బీజేపీ శ్రేణులు, విద్యార్థులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్రటెండలో ఎటువైపు పోవాలో అర్థం కాక కాస్త నీడ కనిపిస్తే చాలు అక్కడే నిలబడిపోయారు. పైనుంచి సూరయ్య ప్రతాపం..కింద నుంచి డాబర్ రోడ్డు హీట్‌కు వచ్చినవారంతా అల్లాడిపోయారు. ఓ బీజేపీ నేతకు సంబంధించిన కళాశాల నుంచి విద్యార్థునులను సభాస్థలికి ఉదయం పదున్నరకు తీసుకొచ్చారు. మొదట భారత్‌మాతాకి జై..వందేమాతరం అంటూ హడావిడి చేసిన ఆ విద్యార్థునులు కాసేపటికి ఎండవేడిమి తాళలేక ఇబ్బందిపడ్డారు. సభాస్థలికి కాస్త దూరంలో 50 వరకు వాటర్ టిన్‌లను ఏర్పాటు చేయగా అవి కొద్దిసేపటికే అయిపోయాయి. ఆ తర్వాత అక్కడ వాటర్ ఏర్పాటు చేసినవారే లేరు. దీంతో తాగేందుకు నీళ్లు లేక సభకు వచ్చిన వారు తిట్టుకున్న పరిస్థితి. మోడీ తలకాయను పోలిన మాస్కు ధరించిన ఓ పెద్దాయన ఆత్రుతతో వాటర్ క్యాన్ల వద్దకెళ్లి 'ఛీ కనీసం నీళ్లు కూడా సరిగా పెట్టలేదు' అంటూ గునుక్కుంటూ వెళ్లిపోయాడు. మరో అరగంటలో వేదిక వద్దకు మోడీ వస్తారన్న సమయంలో కళాశాల నుంచి తీసుకొచ్చిన విద్యార్థునుల్లో కొందరు ఎండవేడిమికి, దాహానికి తాళలేక 'కావాలి..కావాలి..మాకు వాటర్ కావాలి...వీ వాంట్ ఫ్యాన్స్..' అంటూ రెండు, మూడు నిమిషాలు నినాదాలు చేశారు. తమను తీసుకొచ్చిన నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కొందరు బీజేపీ నేతలు వారికి నచ్చజెప్పడంతో నినాదాలను ఆపేశారు. ఆంక్షల పేరిట సభాస్థలి పరిసర ప్రాంతాల్లోకి కనీసం వాటర్ బాటిళ్లను కూడా అనుమతించలేదు. దీంతో సభ కవరేజి కోసం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు, భద్రత కోసం వచ్చిన పోలీసులు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోయారు. సభ అయిపోగానే ఎయిర్‌పోర్టు బయట ఉన్న షాపుల వద్దకెళ్లి తమ దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మండు వేసవిలో కనీసం నీళ్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో బీజేపీ నేతలపై వచ్చినవారు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.