Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ ఫాంహౌజ్ కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ మహా దోపిడీకి పాల్పడుతున్నారనీ, ఆయన ఫాంహౌజ్ కోసం ప్రత్యేక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసుకుని 40 గ్రామాలకు వాడే కరెంటును ఉచితంగా వాడుకుంటున్న ఘనుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పనికిరాని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు వేల కోట్ల ఖర్చు పెట్టారని ఆరోపించారు. రూ.3కి యూనిట్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కమీషన్ల కోసం రూ.6 వెచ్చించి కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు దిగుమతి విషయంలో సీఎం, అధికారులు చెబుతున్నవన్నీ అబద్దాలని కొట్టిపడేశారు. సింగరేణి కార్మికులు దాచుకున్న సొమ్మును డ్రా చేసి జీతాలు చెల్లిస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసివేత పెద్ద కుట్ర జరుగుతున్నదన్నారు. ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తామనే పేరుతో టీఆర్‌ఎస్ నేతలు కోట్ల రూపాయలను దండకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.17 వేల కోట్ల కరెంటు బకాయిలుంటే ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని రేంజర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తలు గోపాల్, లక్ష్మీ పై టీఆర్‌ఎస్ గూండాలు మారణాయుధాలతో దాడి చేసి చంపే కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్. ప్రకాశ్‌రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుబాష్, జె.సంగప్ప, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.