Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీెపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు
- జవహర్‌నగర్‌లో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ సభ
నవతెలంగాణ-జవహర్‌నగర్
సీఐటీయూ ఆవిర్భావ స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు పునరంకితం కావాలని కేవీఆర్ యూనియన్ అధ్యక్షులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కేవీఆర్ బేస్‌లైన్ రిసోర్సెస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడానికి, ప్రజాతంత్ర పని విధానాన్ని స్వేచ్ఛగా అమలు చేయడం కోసం, లొంగుబాటు ధోరణులకు వ్యతిరేకంగా 1970, మే 30న ఐక్యపోరాటం నినాదంతో సీఐటీయూ ఆవిర్భవించిందని చెప్పారు. భారతదేశంలో వర్గ దోపిడీని అంతం చేసి సాంఘిక మార్పునకు వర్గపోరాటాన్ని తీవ్రతరం చేయాలనే లక్ష్యసాధన కోసం సీఐటీయూ పనిచేస్తుందని చెప్పారు. ఉత్పత్తి సాధనాలను, పంపిణీని సమాజపరం చేస్తే తప్ప కార్మికులను దోపిడీ చేయడం అంతం కాదన్నారు. ఈ మార్పు వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమని, అన్నిరకాల అణచివేత, వివక్షతకు ఎదురొడ్డి పోరాడాలని సీఐటీయూ పిలుపునిస్తోందని చెప్పారు. గ్రామీణ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఉమ్మడి పోరాటాలతో సీఐటీయూ మమేకమవుతుందన్నారు. శ్రామిక మహిళలను ఉద్యమాల్లోకి తీసుకురావడంలో సీఐటీయూ పాత్ర చాలా ముఖ్యమైందని చెప్పారు.
మతోన్మాద ఎజెండాతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మనుస్మృతి ఆధారంగా మెజారిటీ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంలో దళితులు, ఆదివాసులు, మహిళలపై అణచివేత, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గో సంరక్షణ సాకుతో ముస్లిం మైనారిటీలు, దళితులపై దాడులు చేస్తున్నదని, కులాంతర వివాహాల జంటలను ఎంచుకొని వేధింపులకు పాల్పడుతున్నదని తెలిపారు. తద్వారా కార్మికవర్గ ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నన్నారు. నయా ఉదారవాద విధానాలపై పోరాడాలన్నారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా అన్ని స్థాయిల్లో కార్మికవర్గ ఐక్యతకు కృషి చేయాలని, కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే మతతత్త్వ శక్తులను వేరుచేసి ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేవీఆర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్,చీఫ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్,కోశాధికారి హరినాథ్,సయ్యద్ అలీ, ఆర్.నర సింహులు వి.రత్నం సుభాన్,తిరుపతయ్య, సంజిత్ సింగ్,రామకష్ణ,బాలాజీ,కార్మికులు పాల్గొన్నారు.