Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దు చేస్తేనే దేశానికి మేలు
- స్కూళ్ల బాగుకోసమే ఉపాధ్యాయులకు పదోన్నతులు
- సర్కారు బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత
- ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు
- టీఆర్‌ఎస్ పాలనలో కొందరికే ప్రయోజనం : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచే విధంగా నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ని రూపొందించిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. దాన్ని రద్దు చేస్తేనే దేశానికి మేలని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. తెలంగాణ వస్తే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రజలందరూ అభివృద్ధి చెందుతారంటూ భావించామనీ, కానీ కొందరికే ప్రయోజనాలు అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేండ్లు అవుతున్న సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
టీఆర్‌ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఈ కాలంలో వర్షాలు సైతం బాగానే కురిశాయి. నీళ్ల విషయంలో ప్రజల్లో సంతృప్తి ఉన్నది. నిధులు, నియామకాల విషయంలో అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వం ప్రకటించిన 80 వేల కొలువులను పూర్తిగా భర్తీ చేయాలి. అప్పుడే నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది. ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పారు. అప్పు రాకపోతే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు ఎట్లా అనే పరిస్థితికి వచ్చింది. అప్పుల తెలంగాణగా మారింది. రాష్ట్రంలో రెవెన్యూ బాగున్నా నిధుల వినియోగం సరైన పద్ధతిలో లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. సామాజిక తెలంగాణగా మారుతుందని ఆశించారు. కానీ కొంతమందికే ఆర్థిక వనరులు ఉపయోపడుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. అందరికీ సమాన అవకాశాలుండాలి.
మన ఊరు-మనబడి కార్యక్రమంతోపాటు సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పట్ల మీ అభిప్రాయమేంటీ?
ఈ చర్యల ద్వారా తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. మన ఊరు-మనబడి కార్యక్రమంలో మొదటి విడతలో 35 శాతం స్కూళ్లను బాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు తరగతి గదుల నిర్మాణం, రంగులు, ఫర్నీచర్, డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, మధ్యాహ్న భోజనశాలలు వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. తల్లిదండ్రులు ఎక్కువ మంది సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించడానికి అవకాశమున్నది. ఇంకోవైపు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది. ఈనెల 13న పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నాయి. ఈలోపు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలి. అప్పుడే ఆంగ్ల మాధ్యమం విజయవంతమవుతుంది.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని కనబరచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు?
ఇది ఉపాధ్యాయుల అభిప్రాయమే కాదు. విద్యారంగంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఇదే అభిప్రాయముంది. పదోన్నతులు కల్పించడం టీచర్ల కోసం కాదు. సబ్జెక్టు టీచర్ పోస్టు ఖాళీగా ఉంటే విద్యార్థి నష్టపోతారు. ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలి. అప్పుడే బడులు బాగుపడతాయి. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు, స్కూల్ అసిస్టెంట్ గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టుల వరకు పదోన్నతులు కల్పించొచ్చు. ఎండాకాలంలో పదోన్నతులు కల్పిస్తారని భావించాం. ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెంటనే పదోన్నతులు కల్పించేందుకు షెడ్యూల్ ప్రకటించాలి.
నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులకు ఎలాంటి మేలు కలుగుతుందంటారు?
భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. భిన్న మతాలు, భిన్న కులాలు, వేర్వేరు ప్రాంతాల ప్రజలైనా అందరం భారతీయులమేనన్న భాన ఉన్నది. కానీ నూతన విద్యావిధానం ద్వారా ఈ భావాన్ని పెంపొందించకుండా మతోన్మాదాన్ని పెంచేలా రూపొందించడం ప్రమాదకరం. ఇది ఈ దేశానికి పనికిరాదు. కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర బడ్జెట్‌లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి. కానీ మూడు శాతానికి మించడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగానికి 2.6 శాతం నిధులు కేటాయించింది. మతోన్మాదం, ప్రయివేటీకరణ విధానాలను పెంచేలా నూతన విద్యావిధానం ఉన్నది. దాన్ని రద్దు చేయాలి. దేశాభివృద్ధి, ప్రగతిశీల భావాలుండేలా, సమగ్ర విద్యావిధానం రూపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించాలి.
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు బాగా పడిపోయాయని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రకటించింది. దీనిపై ఏమంటారు?
కరోనా వల్ల ప్రత్యక్ష బోధన స్థానంలో ప్రత్యామ్నాయ బోధనను విద్యార్థులందరిలోకి తీసుకెళ్లలేదు. అందుకే విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పడిపోయాయి. దాన్ని తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి. సరైన పద్ధతిలో విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో పడిపోయిన సామర్థ్యాలను పెంచేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.