Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలివ్వకుంటే జెండాలు పాతుతాం
- రాజులకు సీలింగ్ యాక్టు వర్తించదా : అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలివ్వకుంటే ఆ పొలాల్లో రైతులతో జెండాలు పాతిస్తామని, పోలీసులతో తుపాకులు ఎక్కుపెట్టినా భూములు వదిలేది లేదని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి స్పష్టంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎల్లూరు గ్రామంలోని మామిడి తోటలో ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ సంస్థాన రాజు ఆదిత్య లక్ష్మణ రావు 42 ఏండ్ల కిందట ప్రభుత్వానికి అప్పగించిన 2,600 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేదలకు భూములిచ్చి వాటిని 40 ఏండ్ల తర్వాత ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమేంటని ప్రశ్నించారు. దేశంలో భూ పరిమితి చట్టం అమలులో ఉన్నప్పటికీ సీలింగ్ యాక్టు చట్టం ఎందుకు అమలుచేయడం లేదన్నారు. రాజులకు ఈ పరిమితులు ఎందుకు విధించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకోవడం వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భూములతో ఎలాంటి సంబంధం లేని రాజు భూమిపై హక్కులు ఏనాడో కోల్పోయారని గుర్తు చేశారు. హక్కులున్నా అవి 50 ఎకరాలు మాత్రమేనని, మిగతా భూములకు ఎలాంటి షరతుల్లేకుండా పేదలకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ పోరాటానికి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఎలాంటి షరతుల్లేకుండా సాగు భూములకు పట్టాలివ్వాలన్నారు. భూస్వాముల ఆగడాలు అరికట్టి పేదల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు గ్రామాల్లో 400 ఎకరాల సాగు భూములపై రాజు కన్నేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైన ఈ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. అనంతరం నాయకులు సాగు భూముల రైతులకు పట్టాలివ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమం లో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, హైకోర్టు న్యాయవాది అర్జున్, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శ్రీనివా సులు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, శివవర్మ తదితరులు పాల్గొన్నారు.