Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డ్రైవింగ్ లైసెన్సున్న మైనార్టీ ఆటో డ్రైవర్లందరికీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆటోలివ్వాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధి బృందం మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు లేక మైనార్టీ యువత ఆటోలు నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు. సొంత ఆటోలు లేక పోవటంతో ఆర్థిక భారాన్ని మోస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి మైనారిటీ ఆటో డ్రైవర్లుకు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆటోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన చమురు ధరల వల్ల పొద్దస్తమానం ఆటో నడిపినా ఆటో కిరాయిలు కట్టలేక పోతున్నారని తెలిపారు. ప్రయివేటు ఫైనాన్సియర్ల వద్ద అప్పులు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసిన వారు ఆయా కిస్తీలు కట్టలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. కరోనాతో లాక్ డౌన్ వల్ల దెబ్బ తిన్న డ్రైవర్లను ఆదుకోవాలనీ, వారికి కనీసం రూ.30 వేలు ఆర్థిక సహాయాన్ని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించాలని కోరారు. గతంలో ఇదే అంశంపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రికి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎమ్‌డీకి వినతిపత్రం సమర్పించామని గుర్తుచేశారు. మైనార్టీ సంక్షేమం శాఖ డైరెక్టర్ నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాసి మూడేండ్లు గడిచినా ప్రభుత్వం నేటికీ స్పందించలేదని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆవాజ్ రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ సత్తార్, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ యాకూబ్, ఆటో డ్రైవర్లు మహమ్మద్ అహ్మద్ పాషా, మహమ్మద్ హర్షద్ తదితరులు ఉన్నారు.