Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులో పడి కుటుంబం ఆత్మహత్య
- మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కూతుర్లు
- పిల్లలిద్దరూ పదేండ్లలోపు వారే
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పది వేల రూపాయల అప్పు.. నలుగురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. ఆ అప్పును తీర్చేందుకు మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. నా అనుకున్న వాళ్లూ అప్పు ఇవ్వడానికి నిరాకరించారు. ముందు అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. మనస్తాపంతో చివరకు ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు పదేండ్లలోపు ఇద్దరు చిన్నారులున్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన ఈ కుటుంబ సభ్యులు నగర శివారుల్లోని కుర్మల్‌గూడ చెరువులో పడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గల్లంతైన మృతదేహాల కోసం చెరువులో డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి ఆదిభట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖుద్దూస్‌పాష, ఫిర్ధోస్ మృతదేహాలను రాత్రి వెలికి తీశారు. కాగా, ఫాతిమా, పెద్ద కూతురు మోహక్(9) మృతదేహాలను మంగళవారం ఉదయం వెలికి తీశారు.
ఖుద్దూస్ పాష (37)కు 11 ఏండ్ల కితం బాలాపూర్ షాహీన్ నగర్‌కు చెందిన ఫాతిమాతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మెహక్ (9), ఫిర్దోస్ (6)లు ఉన్నారు. ఖుద్దూస్‌పాష వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరు నెలల కిందట ఖుద్దూస్‌పాష ప్రమాదవశాత్తు కింద పడటంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూ.10 వేలు అప్పుయ్యింది. అప్పటి నుంచి ఆర్యోగం పూర్తిగా కోలుకోకపోవడంతో పనులూ చేయలేని పరిస్థితి. మరోపక్క రూ.10వేలు అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. ఖుద్దూస్‌పాష తీసుకున్న అప్పును తీర్చేందుకు రూ.10వేల కోసం బంధువులు, స్థానికులు, ఫైనాన్సర్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఒక ఫైనాన్సర్ షాహీన్ నగర్‌కు చెందిన తన బావమరిది గ్యారంటీ ఇస్తే రూ.10వేలు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నా.. గ్యారంటీ ఇవ్వడానికి బావమరిది ముందుకు రాలేదు. సోమవారం రాత్రి సంతోష్‌నగర్‌లో భార్యాభర్తల మధ్య అప్పు విషయమై వివాదం తలెత్తింది. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఖుద్దూస్‌పాషతో పాటు భార్య ఫాతిమా, ఇద్దరు పిల్లలు మెహక్, ఫిర్దోస్‌కు గుర్తు తెలియని విష పదార్ధాన్ని ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మల్‌గూడ చెరువు వద్దకు వచ్చిన అక్కడ కూడా వెంట తెచ్చుకున్న పురుగుల మందును మరింత తాగి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా గ్రామస్తులు గమనించే లోపు ఆ నలుగురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో గ్రామస్తులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చెరువులో గాలిస్తుండగా ఖుద్దూస్‌పాష, చిన్న కూతురు ఫిర్దోస్ మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన తల్లి ఫాతిమా, పెద్ద కూతురు మెహక్ మృతదేహాలు మంగళ వారం తెల్లవారు జామున లభ్యమయ్యాయి. వారి మృతదేహాలను ఉస్మాని యాకు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఆదిభట్ల సీఐ నరేందర్ తెలిపారు.