Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిభ కనబర్చిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు..
- ఎంజేపీ గురుకులాలు, హాస్టళ్లలో సాంస్కృతిక, ఆటలపోటీలు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ-కల్చరల్
బీసీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అర్హులుగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనకకు నెట్టేయబడ్డారని చెప్పారు. నేడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక, నృత్య పోటీల్లో గెలిచిన విద్యార్థులకు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించి వారిని నాసా వరకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 19 గురుకులాలు ఉంటే, నేడు 281కి పెంచుకున్నామన్నారు. వీటికి అదనంగా బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 700 హాస్టళ్లలో 420 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 280 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 46,457 మంది ఉంటున్నారని తెలిపారు. వీరిలో విద్యతో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్రియేటివ్ థింకింగ్, కెపాసిటీ బిల్డింగ్, అంతర్గత నైపుణ్యాల్ని వెలికితీసి ఆత్మవిశ్వాసం పెంచేలా సాంస్కృతిక పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. రెండు నెలలుగా సమ్మర్ కార్నివాల్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శిక్షణా తరగతులతో పాటు పోటీలు నిర్వహించామన్నారు. ఎంజేపీ స్కూళ్లలోని విద్యార్థులు విద్యతో పాటు గతంలో సెయిలింగ్ ఇతర రక్షణ క్రీడల్లో జాతీయ స్థాయి పతకాలు సాధించారని, ఇప్పుడు హాస్టల్ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయ స్థాయి పోటీలతో పాటు అటా, తానా, టీడీఎఫ్ వంటి సంస్థలు నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు సైతం పంపుతామన్నారు, ప్రతి ఏటా సాంస్కృతిక పోటీలతో పాటు ఆటల పోటీలనూ నిర్వహిస్తామన్నారు.
బీసీలకు కేటాయించిన వేల కోట్ల నిధులను ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల రూపంలో అందజేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేలా మహాత్మా జ్యోతిబాపూలే పేరుమీద ఒక్కో విద్యార్థికి రూ.20లక్షలు అందజేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో పోటీపడేలా నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు బీసీ స్టడీ సర్కిళ్లు కృషి చేస్తున్నాయని, ఇప్పటికే గ్రూప్ 1 కోచింగ్ ప్రారంభించామని, ఎస్‌ఐ, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల కోసం నియోజకవర్గానికి ఒక స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేశం, బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్, సభ్యులు కిషోర్ కుమార్‌గౌడ్, ఉపేంద్ర, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, రఘోత్తమ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, బీసీ సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.