Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగని ఆత్మహత్యల పరంపర
- గాల్లో దీపంలా కౌలు రైతుల బతుకులు
- రైతులను డిఫాల్టర్లుగా మార్చిన 'రుణమాఫీ'
- పోరాటాల ఫలితంగానే రైతుబంధు, రైతు బీమా
- సమస్యలపై సర్వేలు చేస్తాం...ఉద్యమాలు నిర్మిస్తాం : నవతెలంగాణతోతెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్
నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ నినాదం...ప్రస్తుతం మరోసారి నినాదంగా మారిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ చెప్పారు. ఉద్యమ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతుల బతుకుల్లోనూ మార్పేమీలేదన్నారు.వారి ఆత్మహత్యలు ఆగనే లేదనీ, కౌలు రైతుల బతుకులు గాల్లో దీపంలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడంతో చాలా మంది రైతులపై డిఫాల్టర్లు అనే ముద్రపడిందని చెప్పారు. దీంతో వారికి అప్పులు పుట్టని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన పంటల ప్రణాళిక లేకపోవడం వల్ల అనేక ఆహార ధాన్యాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికీ 60 శాతం పండ్లు,కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. పాలకులు తమ అవసరాల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు తప్ప ప్రాధాన్యతా క్రమంలో నిర్మించడంలేదని విమర్శించారు. రైతు సంఘాలు, వామపక్షాల పోరాట ఫలితంగానే రైతుబంధు, రైతుబీమా పథకాలు పురుడుపోసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వేలు నిర్వహిస్తామనీ, వాటి ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను (జూన్ 2) పురస్కరించుకుని సాగర్ నవతెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు...
తెలంగాణ ఉద్యమ సమయంలో రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీలేంటి?
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రైతులకు అనేక హామీలిచ్చారు. ప్రతి ఎకరాకు సాగునీరు, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు అందిస్తామని చెప్పారు. లక్ష రూపాయలోపు రుణమాఫీ, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే ఉద్యమం జరిగింది. వీటిపై రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. రైతుల ఆత్మహత్యలు ఆపుతామనీ, పంటల కొనుగోళ్లను గ్యారంటీ చేస్తామంటూ స్పష్టమైన హామీ ఇచ్చింది. మొదటిసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించడం ప్రారంభించింది. రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న హామీని తుంగలో తొక్కింది.
ఏనిమిదేండ్ల కాలంలో రైతు పరిస్థితి ఏంటి?
రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడంలో రైతాంగానికి కొత్త అప్పులు రాకపోగా, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం రూ 25వేల రుణాలు మాత్రమే మాఫీ చేసింది.దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను గుర్తించానికి సిద్ధపడలేదు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతుసంఘాలు, వామపక్షాలు ఉద్యమాలను ఉధృతం చేయడంతో సర్కారు అనివార్యంగా రైతు ఆత్మహత్యలను గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తే, ఐదులక్షలు కాదు, ఆరు లక్షలు ఇస్తామని సీఎం ప్రకటన చేశారు. ప్రభుత్వం తెచ్చిన రైతుబీమా స్కీమ్‌ను రైతు సంఘాలు ఆహ్వానించాయి.అందులో 58 ఏండ్ల వయస్సు పరిమితి పెట్టింది. బీమా కంపెనీల కోసం వయస్సు పరిమితిని పెంచడం లేదు. ఇది ఒక ప్రధానమైన బలహీనత. రాష్ట్రంలో 30 శాతం వ్యవసాయం కౌలు రైతుల ద్వారా సాగుతున్నది. వారికి సంబంధించి 2011 కౌలు రైతు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం స్వీకరించింది. రెండేండ్లపాటు అమలు చేసింది. రుణార్హత కార్డులు ఇచ్చింది. కౌలు రైతులు, భూస్వాములు మాట్లాడుకుంటారని చెప్పి ఆ తర్వాత ఆ చట్టాన్ని గాలికొదిలేసింది. ఆత్మహత్యల్లో కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు. వాటిని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పత్తి, వడ్లు అమ్ముకుంటే ఆ డబ్బులు భూయాజమాని ఖాతాలో జమ అవుతున్నాయి. అందుకే కౌలు రైతులను గుర్తించాలి. కౌలు రేట్ నిర్ణయించాలి. అప్పుడే వారికి ఉపశమనం కలుగుతున్నది. చిన్న, సన్న కారు రైతులకు రుణం అందాలి. రైతాంగం సుదీర్ఘ పోరాటం ఫలితంగా ప్రభుత్వం విద్యుత్ మీటర్లు పెట్టే ఆలోచన మానుకుంది. రైతాంగం ఒత్తిడి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మీటర్లు బిగించే ప్రయత్నం చేయడంలేదు.
రుణమాపీ ఏకకాలంలో చేయకపోవడం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఏమిటి?
ఎన్నికల సమయంలో పాలకులకు రుణమాఫీ గుర్తుకు వస్తున్నది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో చేయకుండా విడతలవారీగా చేసింది. దీంతో రైతాంగం నష్టపోతున్నది. రైతులు డిఫాల్టర్లుగా మారుతున్నారు. తప్పు చేసింది ప్రభుత్వం... అందుకు బలవుతున్నది రైతులు. రుణమాఫీ సకాలంలో చేయకపోవడంతో వడ్డీ భారం పడుతున్నది. ఏకకాలంలో చేయకపోవడంలో ఆత్మహత్యలు, అధికవడ్డీ, ఏటా రూ 20వేల కోట్లు అప్పులు పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ ప్రకారం 18 శాతం రుణాలివ్వాలి. దీని ప్రకారం తెలంగాణ రైతులకు లక్ష కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. దీన్ని సరిగా అమలు చేస్తే రైతు ఆత్మహత్యలను ఆరికట్టవచ్చు. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దోపిడీని నివారించవచ్చు. కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. క్వింటాకు రూ 1,300.రూ 1,400. రూ 1,500లకు అమ్ము కుంటున్నారు. 15రోజులకు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం బంద్ చేస్తున్నది. వాస్తవంగా కనీస మద్దతు ధర అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారు.
పంటల ప్రణాళిక ఎలా ఉంది ?
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేదు. రాష్ట్రానికి అవసరమైన ఆహార ధాన్యాలు, పప్పుదినుసులు, నూనే గింజలు, పండ్లు, కూరగాయాలు...వాటిని ఎక్కడెక్కడ పండించాలి. అనే విషయమై నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించడానికి వీలుగా రైతు సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఏ జిల్లాల్లో ఏయే పంటలు పండుతాయో నిర్ణయిస్తే దిగుబడి పెరుగుతుంది. పండ్లు, కూరగాయలను 60 శాతం దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితికి స్వస్తిపలకాలి. సాయిల్ హెల్త్ కార్డులు ప్రతి గుంటకు ఇస్తామని చెప్పింది. ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది.
సాగునీరు ఎలా అందుతుంది? ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలేంటి?
ప్రతిగంటకు సాగునీరు, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అన్నారు. వాస్తవంగా ఉద్యమమే దీని ప్రాతిపదికంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులుగానీ, ఎత్తిపోతల పథకాలకుగానీ నిర్దిష్టమైన ప్రణాళిక లేవు. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. తక్కువ బడ్జెట్‌తో ప్రాజెక్టులు నిర్మించాలంటే ముందుగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రారంభం కావాలి. కానీ ఆయా జిల్లాలో ప్రాజెక్టులుపూర్తి చేయలేదు. ప్రాణహిత ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ 8వేల కోట్లు ఖర్చు చేసింది. దాని గురించి టీఆర్‌ఎస్ పట్టించుకోవడంలేదు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రంలో జరగలేదు.
ఉద్యమ కార్యాచరణ ఏమిటి?
ఎనిమిదేండ్ల కాలంలో తలెత్తిన వ్యవసాయ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఉద్యమాలు నిర్మిస్తాం. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా ఉద్యమాలు నిర్వహిస్తాం. క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తాం. వాటిని ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా తెలంగాణ రైతుసంఘం కృషి చేస్తున్నది.