Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు సీఎం.. రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అదే స్ఫూర్తితో పునర్ నిర్మించుకుంటున్నామని ఆయన తెలిపారు. తద్వారా తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశానికే దిక్సూచిగా నిలిచిందని బుధవారం రాత్రి విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటూ ముందుకు పోతున్నదని వివరించారు. కేంద్రం సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు, రివార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఇది తెలంగాణలోని ప్రతీ బిడ్డా గర్వించదగిన సందర్భమని సీఎం తెలిపారు. ప్రజల మేలుకోసం ధృఢమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం, వాటిని పట్టుదలతో అమల్జేస్తున్న అధికార యంత్రాంగం, అంతకుమించి ప్రజల సహకారం... ఇవన్నీ కలిసి తెలంగాణ ఘన విజయాలకు కారణమవుతున్నాయని కేసీఆర్ ప్రశంసించారు.
రాజ్‌భవన్, పబ్లిక్ గార్డెన్‌లో నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌తోపాటు పబ్లిక్ గార్డెన్స్‌లోనూ వేడుకలను నిర్వహించనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితమే తెలంగాణ అని పేర్కొన్నారు. మరోవైపు పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.