Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేసిన టీఆర్‌ఎస్
- కాళేశ్వరంతోనే అన్ని జిల్లాలకూ నీళ్లు రావు
- రాష్ట్రమంతా అమలు కాని దళితబంధు
- దానధర్మాలతో ప్రజల జీవితాల్లో మార్పురాదు
- సమస్యలపై ఉద్యమించేది కమ్యూనిస్టులే
- అధికారం కోసం బూర్జువా పార్టీల పాట్లు
- మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో చేసిన అభివృద్ధికి సంబంధించి విడుదల చేసిన ప్రగతి నివేదిక తప్పులతడకగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించేది కమ్యూనిస్టులే నని ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి బూర్జువా పార్టీలన్నీ ప్రజా సమస్యలను వదిలేసి అధికారం కోసమే పాట్లు పడుతున్నాయని విమర్శించారు. అధికారం నిలబెట్టుకోవడానికి టీఆర్‌ఎస్, అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేస్తామో అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆ పార్టీలు స్పందించడం లేదన్నారు. బూర్జువా పార్టీలకు భిన్నంగా ప్రజా సమస్యలు, వారి ఇబ్బందులను పరిష్కరించాలంటూ కమ్యూనిస్టు పార్టీలే పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. జూన్ రెండు నాటికి తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేండ్లు అవుతున్న సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
టీఆర్‌ఎస్ ఎనిమిదేండ్ల పాలనపై మీ అభిప్రాయమేంటి?
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదికను విడుదల చేసింది. అది తప్పుల తడకగా ఉన్నది. అభివృద్ధి చేసింది కొంచెం చెప్పుకునేది ఎక్కువగా ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఆవిర్భవించింది. నీళ్ల విషయంలో కాళేశ్వరం తప్ప ఏమీ చేయలేదు. ఇక నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలోని అన్ని కుటుంబాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వ్యక్తిగత లబ్ది కోసమే పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. నియామకాల విషయంలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో మూడు లక్షల పోస్టులు ఖాళీ ఉంటే, కేవలం 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడు, నాలుగు జిల్లాలకే నీళ్లు వస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఆ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనముండదు. నీళ్ల విషయంలో ఉమ్మడి వరంగల్‌కు దేవాదుల, ఉమ్మడి ఖమ్మానికి సీతారామ, ఉమ్మడి నల్లగొండకు డిండి, మాధవరెడ్డి కెనాల్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. భారీ ప్రాజెక్టులే కాకుండా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులనూ పట్టించుకోవాలి. అప్పుడే కోటి ఎకరాల మాగాణకు నీళ్లు అందుతాయి. పారిశ్రామికాభివృద్ధితోనే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది.
ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారడాన్ని ఎలా చూడాలంటారు?
తెలంగాణ ఆవిర్భవించినపుడు అప్పు రూ.50 వేల కోట్లు ఉండేది. ఈ ఎనిమిదేండ్లలో అది రూ.మూడు లక్షల కోట్లు అయ్యింది. సంక్షేమ పథకాల అమలుకు డబ్బు సరిపోవడం లేదు. అప్పుల మీద ఆధారపడి వాటిని అమలు చేసే పరిస్థితికి వచ్చింది. నిధులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేస్తున్నది. అప్పులు తెచ్చుకునేందుకు ఆంక్షలు విధిస్తున్నది. భవిష్యత్తులో ఉద్యోగులకు జీతాలిచ్చేందుకూ ఇబ్బంది ఉన్నట్టు మీడియాలో వస్తున్నది. సంక్షేమ పథకాల పేర దానధర్మాలు చేస్తే బంగారు తెలంగాణ ఆవిర్భావం కాదు. ప్రజల జీవితాలు మారవు. కుటుంబాలు అభివృద్ధి చెందేందుకు నిర్దిష్టమైన కార్యాచరణను అమలు చేయాలి. మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. దళితబంధు పథకం రాష్ట్రమంతా అమలు కావడం లేదు. ఎన్నికలు వచ్చిన చోట అమలు చేస్తున్నారు. రూ.17 వేల కోట్లతో రైతుబంధు అమలు చేస్తున్నారు. భూమిలేని పేదలను పట్టించుకోవడం లేదు. డబుల్‌బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. నిధుల సమస్య తీవ్రంగా ఉన్నది.
ప్రజల సమస్యలపై మీరు నిర్వహించే ఉద్యమాలేమిటి?
ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నది కమ్యూనిస్టులే. పోడు భూముల సమస్యపై పేదలకు అండగా నిలబడుతున్నాం. పెద్దఎత్తున పోరాటాలు నిర్మించాం. దాన్ని తట్టుకోలేక పట్టాలిస్తామంటూ ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మల్లన్న సాగర్, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో భూనిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్నది మేమే. ఆశాలు, అంగన్‌వాడీలు, మున్సిపాల్, పంచాయతీ కార్మికుల సమస్యలపై సమ్మెలు, ఆందోళనలు చేపట్టాం. అసంఘటిత కార్మికుల సమస్యలపై పోరాడుతున్నాం. ఉపాధి హామీ చట్టం కూలీల సమస్యపై స్పందిస్తున్నాం. ఇలా అన్ని రకాల ప్రజల సమస్యలపై ఉద్యమిస్తున్నాం.
మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిపొందాలని బీజేపీ చూస్తున్నది. దీనిపై ఏమంటారు?
బీజేపీ నాయకులు ప్రసంగాలన్నీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగానే ఉంటున్నాయి. ప్రజల సమస్యలపై వారు మాట్లాడ్డం లేదు. హిందూ ఏక్తా యాత్ర పేరుతో ప్రజల మధ్య హిందూ, ముస్లిం అంటూ చిచ్చుపెడుతున్నారు. వారి ఆటలను సాగనివ్వం. ఓ రాజకీయ పార్టీ అన్ని మతాలనూ సమానంగా చూడాలి. కానీ ఒక మతానికి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదు.
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చినట్టేనా?
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజల సమస్యలపై కాకుండా అధికారంపైనే దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు చెప్తు న్నాయి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ చెప్తున్నది. డబుల్ ఇంజిన్ సర్కారు కావాలంటూ బీజేపీ చెప్పుకుంటోంది. కానీ ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ పార్టీలేవీ పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మోడీ ప్రభుత్వ అసమర్థత వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. వాటిపై బూర్జువా పార్టీలు ఉద్యమించడం లేదు. కమ్యూనిస్టు పార్టీలు వాటికి భిన్నంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నాయి. వరంగల్‌లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలంటూ ఉద్యమం సాగుతున్నది. ఇలా అనేక సమస్యలపై పోరాటాలు చేపడుతున్నాం.