Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లులిస్తేనే సహకరిస్తామని సర్పంచ్‌ల అల్టిమేటం
- నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు
- కేంద్రం నిధులివ్వకపోవడమూ ఓ కారణమంటూ నచ్చజెప్పే యత్నం
- పల్లెప్రగతిని అడ్డుకునే వారిపై చర్యలు తీసుకునే దిశగా కసరత్తు
- బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయ క్రీడలో సర్పంచ్‌ల ఇక్కట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఐదో విడత పల్లె ప్రగతి సజావుగా ముందుకు సాగుతుందా? అనే దానిపై ధర్మ సందేహం నెలకొంది. పెండింగ్ బిల్లులను విడుదల చేస్తేనే సహకరిస్తామని ఇప్పటికే సర్పంచ్‌లు అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. రాష్ట్రం వైపు నుంచి పెండింగ్ బిల్లులే లేవు..కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇవ్వాల్సిన నిధుల విషయంలో జాప్యం వహించడం వల్లనే అవి ఆగాయని వివరించి నచ్చజెప్పి చాలా మేరకు సర్పంచ్‌లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారికి తెచ్చుకున్నది. అదే సమయంలో పల్లెప్రగతిని కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో అడ్డుకోవాలని చూసేవారిపై చర్యలు తీసుకునే దిశగా కూడా రాష్ట్ర సర్కారు ఆలోచన చేస్తున్నది. సర్పంచ్‌లకు న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు..రాష్ట్ర ప్రభుత్వం కనీసం సర్పంచ్‌ల నిధులను కూడా విడుదల చేయలేని దుస్థితిలోకి కూరుకుపోయిందని బీజేపీ నేతలు...ఇలా ఒకరిపై మరొకరు నిందలు మోపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ క్రీడలో నలిగిపోతున్నది సర్పంచ్‌లే.
సర్పంచులు గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు విడుదల చేయడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే సర్పంచ్‌లంతా మూకుమ్మడిగా మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు కూడా అంతే స్థాయిలో స్పందించారు. సర్పంచ్‌లకు మేము అండగా ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ మూడుపేజీల బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా ఉపాధి హామీ చట్టం కింద నయాపైసాను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని ప్రకటించారు. రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో నిధులు సమకూరడంలేదని చెప్పారు. దీనిపై కేంద్రం బ్యాంకులకు ఆర్‌బీఐ ఎలాంటి సూచనలు చేయకపోవడంతో అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తున్నారనీ, ఫలితంగా సర్పంచ్‌ల బిల్లులు కొంతమేరకు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర సర్కారు చెబుతున్నది. ఇదే విషయాన్ని చెబుతూ టీఆర్‌ఎస్ నేతలు సర్పంచ్‌లకు నచ్చజెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1100 కోట్ల ఉపాధి నిధులను ఇవ్వాలని మే మొదటి వారంలో కేంద్రానికి లేఖ రాసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ. 1,013 కోట్లు కూడా రాలేదు. ఇప్పటి వరకు పల్లెల అభివృద్ధి కోసం రూ. 8,963 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ. 2,748 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 514.3 కోట్ల చెల్లింపులు చేశామనీ, సకాలంలో పనులు చేయని వారికి సంబంధించి పెండింగ్‌లో సుమారు రూ. 285 కోట్లను కూడా రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తామని ప్రకటించింది. కేంద్రం సరిగ్గా నిధులివ్వకపోయినా తమ శక్తిమేరకు పల్లెల అభివృద్ధికి కృషి చేయటం వల్లనే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన కింద దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేస్తే అందులో 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయని చెబుతున్నది.
బీజేపీ నేతలేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర సర్కారు వేరే పథకాలకు దారిమళ్లించి కేంద్రంపై టీఆర్‌ఎస్ సర్కారు నిందలు మోపుతున్నదని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాల చర్యల వల్ల అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు నేడు బిల్లులు అందక తిప్పలు పడుతున్నారు. వారిలో నివురుగప్పి ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడుతున్నది. ఫలితంగానే పల్లెప్రగతిని బారుకాట్ చేస్తామనే దాక పరిస్థితి వచ్చింది.
నేటి నుంచి 17వరకు పల్లెప్రగతి
రాష్ట్రంలో ఐదో విడత పల్లెప్రగతి శుక్రవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ప్రతి గ్రామంలోనూ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. శ్మశానవాటికల సెగ్రిగేషన్ షెడ్‌లను వాడకంలోకి తీసుకొచ్చి అక్కడ తయారయ్యే ఎరువుల ద్వారా ఆదాయం సమకూర్చు కోవడంపై సర్కారు దృష్టి సారించింది. ప్రతి వార్డులో, పంచాయతీలో అభివృద్ధి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. రోజువారీగా చేసే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.
సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
పల్లెప్రగతిలో పాల్గొంటాం. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారనే వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చే ప్రమాదం ఉంది. కొందరు సర్పంచ్‌లు సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంతో బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యమవుతున్నది వాస్తవమే. పెండింగ్ బిల్లుల విడుదల కోసం సర్కారును అడుగుతాం. వాటిని రాబట్టుకుంటాం. కొన్ని పార్టీల నేతలు తమ సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇది సరిగాదు. ఇలాంటి ధోరణులను సహించబోం. గ్రామపంచాయతీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేలా కొట్లాడుతాం.