Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 వరకు నిర్వహణ
- ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
- రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇప్పటికే దీన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో ఉన్న జెడ్‌పీహెచ్‌ఎస్‌లో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి జయశంకర్ బడిబాట కార్యక్రకమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ ప్రాంతాలు, విద్యార్థులుండే నివాస ప్రాంతాలను ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తిరగాలి. ఈనెల 13 నుంచి 30వ తేదీ వరకు రోజువారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. బడిబాటకు సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను రూపొందించడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆ పాఠశాల గ్రాంటు నుంచి నిధులను వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఇప్పటికే సూచించింది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేర్పించిన జిల్లాలో మూడు, రాష్ట్రంలో పది పాఠశాలలను ఎంపిక చేసి సన్మానం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటింంచింది. బడిఈడు పిల్లలను గుర్తించి దగ్గరలోని సర్కారు బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేండ్లున్న పిల్లలను గుర్తించి దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రకటించింది. ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులను ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్), ఉన్నత పాఠశాలలో చేర్పించాల్సి ఉంటుంది. ఏడు, ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో నమోదు చేయాలి. తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేయాలి. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, పదో తరగతి మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుండడం, ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున బడిబాటను వాయిదా వేయాలంటూ పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.