Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని యూఎస్‌పీసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలలో ప్రభుత్వ జాప్యానికి నిరసనగా ఈనెల ఆరో తేదీన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ గురువారం ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 అమలు కారణంగా ఉపాధ్యాయుల పదోన్నతులకు గల ఆటంకాలు తొలగిపోయాయని తెలిపింది. ఏడేండ్లుగా పదోన్నతులు, నాలుగేండ్లుగా బదిలీల్లేక అర్హత కలిగిన ఉపాధ్యాయులకు నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొంది. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్)లో తెలంగాణ విద్యార్థుల వైఫల్యానికి పలు కారణాలతోపాటు, పర్యవేక్షణ వ్యవస్థ లోపం, సబ్జెక్ట్ టీచర్ల కొరత సైతం ప్రధాన కారణాలనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించింది. ఇకనైనా దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పున్ణప్రారంభం నాటికి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలనీ లేదంటే ఈనెల మూడో వారంలో హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించింది. షెడ్యూల్ విడుదలయ్యే వరకూ నిరంతర పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది.