Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీలకు ప్రతినెలా నిధులిస్తున్నాం
- కేంద్రం రూ.1400 కోట్లు ఇవ్వాలి
- రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టాం : మంత్రి కేటీఆర్
- పల్లె, పట్టణ ప్రగతిలను జయప్రదం చేయండి
- స్వార్ధ రాజకీయాల కోసం పెండింగ్ బిల్లులపై దుష్ఫ్రచారం : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి బిల్లు కూడా పెండింగ్‌లో లేదని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీపీలకు ప్రతి నెలా నిధులిస్తున్నామనీ, ఇప్పటిదాకా రూ.10 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల నుంచి రూ.1400 కోట్లను విడుదల చేయడం లేదని చెప్పారు. పెండింగ్ బకాయిల కోసం కేంద్రం పైన బండి సంజరు దండెత్తాలని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మెన్లు, చైర్‌పర్సన్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామనీ, పంచాయతీల్లో అవసరమైన ఉద్యోగాలను భర్తీచేసి పల్లెప్రగతిద్వారా అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నామన్నారు. జీపీలకు తమ ప్రభుత్వం ప్రతి నెలా స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నదని చెప్పారు. ఇప్పటిదాకా రూ.10 వేల కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చిన ఘతన తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ, దీన్ని తిప్పికొట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీ నిధులు, పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు సైతం అసత్యాలను ప్రచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి సదాశివనగర్ సర్పంచ్‌కి సంబంధించిన విషయంలో నిధులు వచ్చినప్పటికీ డబ్బులు రాలేదని ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక అడిషనల్ కలెక్టర్ నియమించిన ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోతున్న ఏకైక మన ప్రభుత్వం మనదేనన్నారు. ఎర్రబెల్లి దయార్‌రావు మాట్లాడుతూ..పల్లెప్రగతిని జయప్రదం చేయాలని కోరారు. జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని స్పష్టం చేశారు. పల్లెప్రగతికి సంబంధించి ప్రజా ప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. బిల్లులు పెండింగ్ అనే ప్రస్తావనపై సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా గ్రామాలలో ఈ ఏడాది రూ.900 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేశామని తెలిపారు. సర్పంచులు, గ్రామాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారనీ, కావాలని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం బిల్లులు పెండింగ్ అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఢిల్లీకి వెళ్లి నిధులు విడుదల కోసం అధికారును కలవాలని ఆదేశించామన్నారు. కొత్తసాఫ్ట్‌వేర్‌ల తో చెల్లింపులు ఆలస్యం కావడంతో పాటు అధికారులకూ విపరీత సమయం వృథా అవుతున్నదని చెప్పారు. ఈ కారణంగానే మెటీరియల్ కాంపోనెంట్‌కు సంబంధించిన బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతున్నదని చెప్పారు.