Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
- భూములు రాజువా, అటవీశాఖవా తేల్చాలి
- కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - కొల్లాపూర్
సాగు రైతులకు పట్టాలివ్వకుంటే రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొల చింతలపల్లి గ్రామ శివారులోని అసత్‌పూర్ భూములకు పట్టాలివ్వాలని రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. గ్రామంలో కొల్లాపూర్ రాజుకు ఉన్న 2,600 ఎకరాల్లో వెయ్యి ఎకరాలు శ్రీశైలం వెనుక జలాల్లో ముంపునకు గురయ్యాయని చెప్పారు. మరో వెయ్యి ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. మిగిలిన భూముల్లో వివిధ సామాజిక తరగతులకు చెందిన రైతులు సాగు చేసుకునేందుకు ఇచ్చారని అన్నారు. గ్రామానికి చెందిన దాదాపు 80 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక తరగతికి చెందిన రైతులు సర్వే నెంబర్ 11లో 400 ఎకరాలను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వీరంతా కంపచెట్లు, ముళ్ల కంచెలు, రాళ్లు, రప్పలుండే భూములను సాగు చేసుకుంటూ సిరులు పండించే పొలాలుగా మార్చారన్నారు. ఇప్పుడు రాజు వారసులు ఆ భూములు తమవే అంటూ రైతులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42 ఏండ్ల క్రిందట కొల్లాపూర్ సంస్థాన రాజు ఆదిత్య లక్ష్మణరావు ప్రభుత్వానికి అప్పగించిన 2,600 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేదలకు భూములిచ్చి వాటిని 40 ఏండ్ల తర్వాత ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమేంటని ప్రశ్నించారు. దేశంలో భూ పరిమితి చట్టం అమలులో ఉన్నప్పటికీ సీలింగ్ యాక్టు చట్టం రాజులకు వర్తించదా అని ప్రశ్నించారు. ప్రత్యేకించి ఈ భూములు రాజువా, అటవీ శాఖవో తేల్చేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పట్టాలివ్వకపోవడంతో రైతు బంధు, రైతుబీమా, ఇతర సబ్సిడీ వంటివి రైతులకు అంద డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే క్రమంలో అటు అటవీ శాఖ, ఇటు రాజావారు రైతులను సాగు చేసుకోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వెంటనే భూముల విషయంలో ప్రభుత్వం కలగజేసుకుని రైతులకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ రమేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు ఈశ్వర్, శివవర్మ, దశరథం, సురేందర్, గిరిజన సంఘం నాయకులు అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారా సింగ్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.