Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో వర్షం
నవతెలంగాణ- బాలానగర్ / కల్వకుర్తి
పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు.. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం.. అదే సమయంలో ఇద్దరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని మోత్కులకుంట తండాకు చెందిన కేతవత్, చత్రు నాయక్(70) వ్యవసాయ పొలం వద్ద మేకలు కాసేందుకు వెళ్లారు. ఆ సమయంలో వర్షంతోపాటు పడుగు పడింది. దాంతో చత్రునాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు.
అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పరిధిలొని కుర్మిద్ద గ్రామానికి చెందిన రైతు తిరుపతయ్య వ్యవసాయ పొలంలో పత్తి విత్తనాలు నాటుతున్నాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. కొందరు కూలీలు చెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటంతో శివుడు(8) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బాలుడు తీవ్రంగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో గాలివాన బీభత్సంతో లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. చెట్లు విరిగి విద్యుత్ వైర్ల మీద పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అశ్వాపురంలో పిడుగు పడటంతో ఓ చెట్టు కాలి బూడిదయింది.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుంగపాడు గ్రామంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృత్యువాతపడ్డాయి. నల్లగొండ, చిట్యాల, చండూరు, మర్రిగూడ, తదితర మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడి వర్షం పడింది.