Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిగ్ వర్కర్ల విషయంలో పెరుగుతున్న డిమాండ్
- ఫుడ్ డెలివరీ కంపెనీల విధానాలతో ఇప్పటికే అనేక ఇబ్బందులు
- కార్మికుల ప్రాణాల మీదకు 'నిమిషాల్లో డెలివరీ' హామీ
న్యూఢిల్లీ : కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ వారి భద్రతను విస్మరిస్తున్నాయి ఫుడ్ డెలివరీ కంపెనీలు. ఇతర కంపెనీలతో పోటీని తట్టుకొని కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో డెలివరీ బార్సుపై ఒత్తిళ్లను పెంచుతున్నాయి. ఫుడ్ ఆర్డర్ చేయగానే నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ సదరు కంపెనీలు కొన్ని రోజుల క్రితం వరకు ప్రకటనలను ఇచ్చాయి. దీంతో కంపెనీల ప్రకటనలకు గిగ్ కార్మికులు బాధితులుగా మిగిలారు. ఆర్డర్‌ను కస్టమర్లకు నిర్ణీత సమయంలోగా అందించే క్రమంలో వారు రోడ్డు ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం. ప్రాణాలూ కోల్పోయారు. సదరు ఫుడ్ డెలివరీ కంపెనీలు తీరుపై గిగ్ కార్మికులూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు కంపెనీల తీరును తప్పుబట్టాయి. అస్తవ్యస్త డెలివరీ విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలు ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. గిగ్ కార్మికులకు భద్రతను, కనీస హక్కులను కల్పించాలని తెలిపాయి. రోజురోజుకూ ఈ డిమాండ్ క్రమంగా పెరుగుతున్నది.
'పది నిమిషాల్లో డెలివరీ'తో కష్టాలు
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ కంపెనీల 'పది నిమిషాల డెలివరీ' మోడల్ చర్చనీయాంశంగా మారింది. కస్టమర్లకు నిర్ణీత సమయంలోగా, వేగంగా ఆర్డర్లను వారి ఇంటి ముందుకు తీసుకెళ్లి అందించటంలో భాగంగా ఫుడ్, గ్రోసరీ డెలివరీ సంస్థలు ఈ విధానాన్ని తీసుకొచ్చాయి. నిమిషాల్లో డెలివరీని కస్టమర్లకు అందించటం కోసం డెలివరీ కార్మికులు వాహనాలపై వేగంగా వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంకోవైపు, నిర్ణీత సమయంలోగా ఆర్డర్లను కస్టమర్లకు చేర్చకపోతే అందుకు వేతనాల్లో కోతలను కార్మికులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
వెనక్కి తగ్గిన సంస్థలు
అయితే, డెలివరీ వర్క్‌ఫోర్స్ కొరత, పెరిగిన ఇంధన ధరలు వంటివి ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల సర్వీసులకు ఆటంకం కలిగిస్తున్నాయని ఒక వార్త సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. దీంతో వివాదాస్పద 'వేగవంతమైన డెలివరీ'లకు ఫుడ్ డెలివరీ కంపెనీలు దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
15 మంది కార్మికులు మృతి.. కంపెనీలు బాధ్యత వహించాలి.
కంపెనీల అత్యుత్సాహ హామీలపై గిగ్ వర్కర్స్ యూనియన్లు, ఫెడరేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ అంచనాల ప్రకారం గత రెండు, మూడు నెలల్లో దేశవ్యాప్తంగా 10 నుంచి 15 మంది కార్మికులు కంపెనీల తీరుతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎందుకు బాధ్యత వహించవు? అని ఆయన ప్రశ్నించారు. కంపెనీల మార్కె టింగ్ జిమ్మిక్కుతో కార్మికులు వేగంగా వాహ నాలను నడుపు కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, దీంతో వారు ట్రాఫిక్ నిబం ధనలను బ్రేక్ చేయటం, ప్రమాదాలకు గుర వటం జరుగుతోందని ఆలిండియా గిగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐజీడబ్ల్యూయూ)కు చెందిన స్పందనా ప్రత్యూష్ తెలిపారు. ఈ క్రమంలో వారికి సామాజిక భద్రత మాత్రమే కాదు.. కొన్ని కనీస హక్కులు, వృత్తిపరమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తమ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు సలావుద్దీన్ తెలిపారు.