Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోటి భూమికి పరిహారం రూ.7లక్షలే..
- గతంలో సీపీఐ(ఎం), రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు
- నోటిఫికేషన్ నిలిపేస్తున్నామని.. మళ్లీ ముందుకు
- ఇండిస్టియల్ పార్కు పేర అసైన్డ్ భూములపై కన్ను
- ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములివ్వం : బాధిత రైతులు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడిన పల్లె నేడు పారిశ్రామిక కాలుష్యంతో కొట్టుకుపోతోంది. రాష్ట్రానికి ఏ కొత్త ప్రాజెక్టులు వచ్చినా ముందుగా ఆ గ్రామంలోనే నెలకొల్పేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంటుంది. ఈ గ్రామంలో ఇప్పటికే 13 ఫార్మా, ఇతర పరిశ్రమలు నెలకొల్పారు.. దీంతో ఈ గ్రామం ఎంత కాలుష్యమయమై పోయిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో ఒకప్పుడు ఎక్కడ తవ్వినా స్వచ్ఛమైన నీరు లభించేది. నేడు ఎక్కడ బోరు వేసినా రసాయనాలతో కలుషితమైన నీరే వస్తోంది. ఇలాంటి ఈ గ్రామంలో పేదలు 50 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను మరో పరిశ్రమ కోసం లాగేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ అకస్మాత్తుగా భూములు గుంజుకునేందుకు కుట్ర చేస్తోంది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 192 ఎకరాలకుపైగా పేదల అసైన్డ్ భూమిని ప్రభుత్వం ఇండిస్టియల్ పార్కు పేరుతో తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. నాటి ప్రభుత్వం పేదలకు సాగు చేసుకునేందుకు భూమిని కేటాయించి అసైన్డ్ పట్టాలను జారీ చేసింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాలకుపైగా రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. 2019లో అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ రైతులకు నోటీసులు జారీ చేసింది. తమ భూములను ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఉద్యమం చేశారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఆర్డీవో ఆఫీసు, కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలు అందించారు. సీపీఐ(ఎం) నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, అఖిలపక్ష నేతలు రైతుల ఆందోళనలకు నేతృత్వం వహించి ముందుకు నడిచారు. గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలోనూ రైతులు అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
సంవత్సరానికి పైగా రైతులు, అఖిలపక్ష నాయకులు చేసిన ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్‌ను నిలిపేస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో ఇక తమ భూములకు ముప్పు లేదని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారం రోజుల కిందట నేరుగా రెవెన్యూ, టీఎస్ ఐపాస్ అధికారులు రైతుల భూముల్లోకి వచ్చి చదును చేసే ప్రయత్నం చేశారు. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకించి వెంటనే ఆర్డీవో, జేసీని కలిసి సమస్యను వివరించారు. ఎకరానికి రూ.7 లక్షల నష్టపరిహారమిస్తామని, నగదు తీసుకొని భూములు అప్పగించకుంటే నగదును కోర్టులో డిపాజిట్ చేసి తమపని తాము చేస్తామని అధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన నోటిఫికేషన్‌ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే గ్రామంలో 13కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. వాటి ద్వారా వచ్చే కాలుష్యంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తమ భూములను ప్రభుత్వం తీసుకొని కోట్ల రూపాయలకు పారిశ్రామికవేత్తలకు అమ్మే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎకరం మార్కెట్ ధర కోటి రూపాయల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందనీ, అటువంటిది పరిహారం రూ.7 లక్షలే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ భూమిని ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. ఇది తమకు తాతల కాలం నుంచి వచ్చిన భూమి అనీ, ఇదే తమ జీవనాధారం అని, భూమిని తీసుకోవద్దని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంటనే తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. తమ భూమిని వదులుకోవడమంటే తమ ప్రాణాన్ని వదులుకోవడమేనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పోలీసులను పెట్టి భూముల పైకి వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గాలని లేకుంటే జరిగే పరిణామాలకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీఎం కేసీఆర్‌లే బాధ్యత వహించాలని రైతులు హెచ్చరించారు.
కొనసాగుతున్న రైతుల దీక్షలు
వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఒక్కసారిగా భూములపైకి వచ్చి చదును చేసేందుకు కుట్ర చేస్తున్న ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా జాతీయ రహదారిపై పక్కనే రైతుల కుటుంబాలతో సహా నిరహారదీక్షలు చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు నిలిచాయి. తమ భూములను తీసుకోబోమని ప్రభుత్వం రాతపూర్వకంగా ప్రకటించే వరకు దీక్ష శిబిరాన్ని వదిలే ప్రసక్తే లేదని వారు హెచ్చరిస్తున్నారు. తమ బాగుకోసం పనిచేస్తున్నమని చెప్పుకునే నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.