Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో పసిపిల్లలకు కూడా రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్‌తో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. పోలీసుల లెక్కల ప్రకారం గత కొంత కాలంగా మహిళలపై లైంగికదాడులు పెరిగాయని చెప్పారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ కేసులో అధికారపార్టీ నేతల పిల్లలు ఉండటంతో ప్రభుత్వం ఆ కేసును నీరుగారుస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది కేసులు నమోదయితే, కేవలం 46 కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడిందని గుర్తు చేశారు. మైనర్ బాలిక వీడియోను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు దోషేనని చెప్పారు. ఇన్నోవా బండి వీడియోను ఆయన ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై ఆయన సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ బాలిక కేసులో బాధ్యులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ లేనప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ విషయంలో టీఆర్‌ఎస్ యూటర్న్ తీసుకుందనీ, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కవల పిల్లల లాంటివని ఆరోపించారు. బీజేపీ నేతలు మరో మతాన్ని కించరపరచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంముందు దేశం సిగ్గుపడేలా బీజేపీ నేతల మాట్లాడుతున్నారని విమర్శించారు.
దేశంలో వివాదాలు సృష్టిస్తున్నారు : వీహెచ్
దేశంలో బీజేపీ నేతలు వివాదాలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. మహ్మద్ ప్రవక్తపై ఆపార్టీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదమయ్యాయని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. భారతదేశం బీజేపీనేతల జాగీరు కాదని హెచ్చరించారు. ఆపార్టీకి మూడోసారి అధికారమిస్తే అది దేశాన్ని ముక్కలు చేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లైంగికదాడికి మద్యమే కారణం : టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్
రాష్ట్రంలో లైంగికదాడులకు ముఖ్యకారణం మద్యమేనని టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం షాపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ పిల్లలు కూడా మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని కార్యకర్తలతో కలిసి ఆయన ముట్టడించారు. ఈసందర్భంగా మెట్టుసారుకుమార్‌తోపాటు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు గోషామహాల్ స్టేషన్‌కు తరలించారు.