Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ,బీజేపీ దీనికి బాధ్యత వహించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అధికార ప్రతినిధిగా నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తను కించపరిచేవిధంగా మాట్లాడి దేశ, విదేశీ ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ వ్యాఖ్యలను చేసినందుకు నూపుర్‌శర్మను, ఆ వీడియోలను వైరల్ చేసిన ఆ పార్టీ నాయకుడు నవీన్ జిందాల్‌పైన క్రిమినల్ చర్యలు తీసుకో వాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నూపుర్ శర్మ ఆర్‌ఎస్ ఎస్, ఏబీవీపీలో చురుకైన నాయకు రాలని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఢిల్లీలో పోటీ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం చేసిన వ్యాఖ్యల ఫలితంగానే యూపీలోని కాన్పూర్ ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లింలు ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముస్లిం దేశాలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ భారత దౌత్యవేత్తల వద్ద తమ నిరసనలు తెలియజేస్తున్నాయని వివరించారు. భారతదేశ వస్తువుల అమ్మకాలను నిలిపేసి యూఎన్‌వోలో సైతం ఫిర్యాదు చేశాయని తెలిపారు. భారత ప్రభుత్వం మాత్రం తమకు సంబంధం లేదనీ, వారిని బీజేపీ నుంచి సస్పెండ్ చేసి తప్పించుకోజూస్తున్నదని విమర్శించారు. బీజేపీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులూ నిత్యం మతప్రాతిపదికన రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సర్వసాధారణంగా మారిందని పేర్కొన్నారు. మరోపక్క మసీదులో విగ్రహాల పేరుతో వైషమ్యాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇది లౌకిక రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషాన్ని రగిలించిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై క్రిమినల్ చట్టం కింద చర్యలు తీసుకోవాలనీ, రాజ్యాంగ విలువలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.