Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 13న కలెక్టరేట్ల ముందు ధర్నాలు
- తెలంగాణ మత్స్యకార్మిక మత్స్యకారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేపపిల్లలకు బదులుగా మత్స్యసొసైటీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని తెలంగాణ మత్స్యకార్మిక, మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. తొలకరి వర్షాలు ప్రారంభను వుతున్న సందర్భంగా మత్స్యశాఖ తగు నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. ఎన్‌సీడీసి ద్వారా రెండో విడతగా మత్స్యకారులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మధ్యదళారీ విధానం పోవాలనే ఉద్దేశ్యంతో మత్స్యకార సంఘాలు ఎన్నో ఏండ్లుగా పోరాడిన ఫలితంగా ఉచిత. చేపపిల్లల పంపిణీ పథకం వచ్చిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చేపపిల్లల కొనుగోలుకోసం మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని సంఘాలు, ఫెడరేషన్లు సంబంధిత మంత్రికి విన్నవించినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. సీడ్ కేంద్రాలు లేని మధ్య దళారీలతో చేపపిల్లల పథకాన్ని అమలుచేయటం వల్ల యేటా కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నదని తెలిపారు. ఉచిత చేపపిల్లల పేరుతో నాసిరకం చేపపిల్లలు, సంఖ్యలో, సైజులో తక్కువగా ఇస్తూ దళారులు కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షలు ముఠా విజయకుమార్ రాష్ట్ర కమిటి సభ్యులు మూఠా దశరథ్, రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.