Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీఐ అధ్యక్షులు మోంతుకుమార్ పటేల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజంలో ఫార్మసీ విద్య ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అధ్యక్షులు డాక్టర్ మోంతుకుమార్ ఎం పటేల్ అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ్డంలోనూ ఫార్మసిస్టులు క్రియాశీలక పాత్ర నిర్వహి స్తున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో 'ఫార్మసి విద్యావేత్తలు ఆరోగ్యరంగంపై వారి ప్రభావం'అనే అంశంపై జాతీయ సెమినార్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫార్మసీ కాలేజీలు విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందిస్తేనే ఉన్నతమైన ఫార్మసిస్టులు బయటికి వస్తారని వివరించారు. మందుల ఆన్‌లైన్ అమ్మకాలకు తాము వ్యతిరేకమని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఉన్న సమయంలో ఫార్మసీ విభాగానికి చెందిన యోధులు కీలకపాత్ర పోషించారని అన్నారు. ఫార్మసీ విద్యకు సంబంధించిన కర్రికులమ్‌ను మారుస్తున్నా మని వివరించారు. కాలేజీలు, మందుల కంపెనీలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తామన్నారు. తెలంగాణ ఫార్మసీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షులు టి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ విద్యలో 12 కొత్త కోర్సులు రాబోతున్నాయని చెప్పారు. రెగ్యులేటరీ సైన్స్, క్లినికల్, ఫార్మాసూటిక్స్, ఫార్మకాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు మరిన్ని కోర్సులు వస్తాయని వివరించారు. ఒక్కో కాలేజీ పది గ్రామాలను దత్తత తీసుకురావాలన్న కొత్త నిబంధనలు పీసీఐ తీసుకురాబోతున్నదని అన్నారు. దీన్ని స్వాగతిస్తామన్నారు. కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, అధ్యాపకులకు మెరుగైన జీతాల కోసం బీ ఫార్మసీకి రూ.72 వేలు, ఫార్మా-డీకి రూ.1.10 లక్షలకు ఫీజులను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీసీఐ ఈసీ సభ్యులు ముత్తవరపు వెంకటరమణ, ప్రభాకర్‌రెడ్డి, రాధాకృష్ణమూర్తి, ఎ రాందాస్, తెలంగాణ ఫార్మసీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి పి రమేష్ బాబు, కోశాధికారి తాళ్ల మల్లేశం పాల్గొన్నారు.