Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 53 లక్షల కుటుంబాలకే కేంద్రం ఉచిత బియ్యం... అదీ ఆర్నెల్లు మాత్రమే
- ఉచిత బియ్యాన్ని ఎక్కడ ఆపాం?
- ఆయిల్ కంపెనీలు మా పరిధిలో లేవు : మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం సేకరణ, ఉచిత బియ్యం పంపిణీపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. అవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. ఎఫ్‌సీఐ రాసిన లేఖకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రం పచ్చగా ఉండటం ఇష్టంలేక కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. చిన్న, చిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్‌సీఐ లేఖ రాసిందని తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్రంతో పాటు రాష్ట్రం ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచిత బియ్యం ఇస్తే కేంద్రం 90,46,000 కార్డులకుగాను కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఈ రకంగా రాష్ట్రం ఎనిమిది నెలల పాటు రూ.980 కోట్ల భారాన్ని భరించిందని వెల్లడించారు. 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకూ తామే ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశామని వివరించారు. దీంతో ఖజానాపై 11 నెలల కాలానికి 1,134 కోట్ల భారం పడిందని తెలిపారు. 2022 మార్చిలో కేంద్రం రాసిన లేఖలో ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని మరోసారి కోరిందన్నారు. మూడో దశలో కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. అయితే సేకరణ, ఇతర కారణాల వల్ల ఆ ప్రక్రియ పంపిణీ ఒక నెల ఆలస్యమైందన్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నామనీ, దీని వల్ల రూ.436 కోట్లు అదనపు భారం పడుతున్నదని తెలిపారు. రూ.2,454 కోట్ల నగదు కూడా ఇచ్చామని చెప్పారు. ప్రయివేటు ఉపాధ్యాయులకూ ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రూ.4,720 కోట్ల భారం పడిందన్నారు.
తనిఖీల్లో తేడాలొస్తే చర్యలు తీసుకున్నాం...
మిల్లుల్లో ఉన్న వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బియ్యం ఇచ్చిన తర్వాతే అధికారముం టుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. తనిఖీల్లో తేడాలొచ్చినా చర్యలు తీసుకోలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేశారనీ, అయితే 4,53,896 బ్యాగుల్లో తేడా ఉందని ఎఫ్‌సీఐ ఆరోపణ చేసిందని గుర్తుచేశారు. రెండోసారి అవే మిల్లులకు వెళ్లి 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని ఫిర్యాదు చేశారన్నారు. మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టిందనీ, మిగతా రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని వివరించారు. ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు లేఖలు రాశామని మంత్రి తెలిపారు. తమ వద్ద 40.63 కోట్ల బ్యాగుల ధాన్యం మా వద్ద ఉందనీ, ఒక్క గింజ తేడా వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రెండో దశలో 63 మిల్లుల్లో తేడా ఉందన్న ఎఫ్‌సీఐ ఆరోపణలను కలెక్టర్లకు పంపించి పరిశీలించాలంటూ ఆదేశించామని గంగుల తెలిపారు. చిన్న చిన్న సాకులతో కొనుగోలు నుంచి తప్పించుకోవడం ఎఫ్‌సీఐకు తగదన్నారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనట్టు ఎఫ్‌సీఐ ఎందుకు దాడి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఏ పంట పండించినా కేంద్రం కొనుగోలు చేయాలనీ, కనీస మద్ధతు ధరలకు చట్టం చేయాలని కోరారు.
ఆయిల్ కంపెనీలు మా పరిధి కాదు...
ఆయిల్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మంత్రి గంగుల స్పష్టం చేశారు. నిల్వ ఉండి ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.