Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ భారీగా డీజిల్ సెస్ పెంపు
- దూరప్రయాణాలు మరింత భారం
- విద్యార్థుల బస్‌పాస్ చార్జీలూ పెంపు
- పెంచకతప్పట్లేదు- టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివిధ సెస్‌ల పేరుతో చార్జీలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ ఈ సారి వాటికి కొనసాగింపుగా డీజిల్ సెస్‌ను మరింత పెంచింది. పెరిగిన చార్జీలు తక్షణం అమల్లోకి వస్తున్నాయి. విద్యార్థుల రాయితీ బస్‌పాసు చార్జీలను కూడా భారీగా పెంచుతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ పెంపు ప్రభావం తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులపై ఉండదని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లు బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ తెలిపారు. కేవలం దూర ప్రయాణం చేసే ప్రయాణీకులపైనే అదనపు డీజిల్ సెస్ భారం పడుతుందని పేర్కొన్నారు. సిటీ బస్సులకు ఈ పెంపు వర్తించదని చెప్పారు. ప్రయాణ దూరాన్ని బట్టి శ్లాబ్‌ల వారీగా పెరిగిన డీజిల్ సెస్ ఉంటుందనీ, ఈ పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. పెరిగిన ఖర్చులతో ఆర్టీసీ నిర్వహణ కష్టతరంగా మారిందనీ, అందువల్లే సెస్‌లు పెంచాల్సి వచ్చిందనీ, ప్రయాణీకులు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు, 12 లక్షల విద్యార్థులకు ఆర్టీసీ సేవలు అందిస్తున్నదనీ, దీనికోసం రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. బల్క్ హెచ్.ఎస్.డి ఆయిల్ ధర 2021 డిసెంబర్‌లో లీటరు రూ.84.75 ఉండగా, 2022 మార్చి నాటికి రూ.118.73 పెరిగిందని వివరించారు. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థపై భారీగా పెరిగిన డీజిల్ ధర ఆర్థిక భారాన్ని మోపిందనీ, రోజుకు దాదాపు రూ.5 కోట్ల నష్టం వస్తోందని తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రతి ప్రయాణీకునికి రూ.2 చొప్పున అదనంగా డీజిల్ సెస్ విధించారు. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా ఇతర అన్ని సర్వీసుల్లో ప్రతి ప్రయాణీకుడికి రూ.5 చొప్పున డీజిల్ సెస్ విధించారు. ఇప్పుడు సిటీ, గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులను విభజించి, ప్రయాణించే దూరాన్ని బట్టి డీజిల్ సెస్‌ను నిర్ణయించారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణీకులపై భారీగా ఆర్థికభారం పడుతుంది.
విద్యార్థుల బస్‌పాస్‌లూ పెంపు
పెరిగిన డీజిల్ ధరను దష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించారు. విద్యార్థుల బస్‌పాసులను 2019లో పెంచారు. తిరిగి ఇప్పుడు మళ్లీ విద్యార్థులకు సంబంధించిన అన్నిరకాల రాయితీ బస్‌పాసుల చార్జీలను పెంచుతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
డీజిల్ సెస్ బాదుడిలా...
పల్లెవెలుగు - 250 కి.మీ. వరకు - రూ.5 నుంచి రూ.45 పెంపు
ఎక్స్ ప్రెస్ - 500 కి.మీ వరకు - రూ.5 నుంచి రూ.90 పెంపు
డీలక్స్ - 500 కి.మీ వరకు - రూ.5 నుంచి రూ.125 వరకు పెంపు
సూపర్ లగ్జరీ- 500 కి.మీ వరకు - రూ.10 నుంచి రూ.130 వరకు
ఏసీ సర్వీసులు - 500 కి.మీ వరకు -రూ.10 నుంచి రూ.170 వరకు పెంపు
(గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంచలేదు)