Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం ఇవ్వకుండానే ట్రయల్ రన్ ఏంటి?
- పనులు చేపట్టొద్దంటూ కోర్టు ఆదేశించినా పట్టదా?
- సీఎం, ఎమ్మెల్యేపై గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల ప్రశ్నాస్త్రాలు
- హుస్నాబాద్‌లో రోడ్లను దిగ్బంధించి ఆందోళన
నవతెలంగాణ-హుస్నాబాద్
'మాఊర్ల నుంచి మమ్మల్నేరుబడేత్తిరి. ప్రాజెక్టు కడితే నీళ్లత్తయని భూములిత్తిమి. ఒక్కరం సచ్చయినా పదిమంది బత్కాలని సూత్తిమి. అయినా సర్కార్ పరిహారం ఇవ్వయడంలో దోకాజెయ్యవట్టె. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపులో పదిహేనేండ్లయినా పరిష్కారం జూపరాయె. ముఖ్యమంత్రి కేసీఆర్ నీది గిదేం లెక్క. గిదేం తరీఖ. ఇంకెంతకాలం మమ్మల్నేడిపిత్తరు. చెట్టుకొకలం... పుట్టకొకలమైనా మా గోస పట్టదా' అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ వారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి రైతులతో పాటు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల నుంచి వందలాది మంది బాధితు లు తరలివచ్చి హుస్నాబాద్‌లో రోడ్లను దిగ్బంధించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించారు. వందలాది మంది గుంపులుగా విడిపోయి, అంబేద్కర్, మల్లెచెట్టు చౌరస్తాలతో పాటు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సిద్దిపేట సీపీ శ్వేత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిం చారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐ రఘుపతిరెడ్డి, డివిజన్‌లోని పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ బలగాలను మోహరించారు. భూనిర్వాసితులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించే ప్రయత్నం చేసినా బాధితులు ప్రతిఘటించి అక్కడే కూర్చున్నారు. 'ఇండ్లు, భూములు పోయి గోసపడుతున్నాం. మేమేం దౌర్జన్యం చేస్తలేం. చట్ట ప్రకారం మాకు రావాల్సిన పరిహారాన్ని అడుగుతున్నాం. పోలీసులు జోక్యం చేసుకోవద్దు' అని బాధితులు వేడుకున్నారు. తమ ఆవేదనను సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. గత్యంతరం లేకనే రోడ్లపైకి వచ్చామన్నారు. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలెవరైనా వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వఋద్ధులు, మహిళలని చూడకుండా పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో తోసేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. బాధితులు మాత్రం అక్కడే బైటాయించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నిర సన కొనసాగుతూనే ఉంది. బాధితులకు ప్రతిపక్షపార్టీలు మద్దతుగా నిలిచాయి. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం హుస్నాబాద్ బంద్‌కు కాంగ్రెస్‌పార్టీ పిలుపునిచ్చింది.