Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనిట్ల ఎంపికలో అధికారుల ప్రమేయం
- ఇప్పటి వరకు24,046 యూనిట్లు గ్రౌండింగ్
- 36వేల కుటుంబాలకు మాత్రమే లబ్ది
- నిరీక్షిస్తున్న దళితులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యం తీవ్రంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. యూనిట్ల ఎంపికలోనూ అధికారుల ప్రమేయం ఉందన్న విమర్శలున్నాయి. లబ్దిదారులు తమకు అనువైన యూనిట్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించినప్పటికీ..కొన్ని ప్రాంతాల్లో అధికారులు వారిని ప్రభావితం చేసి ఫలానా కంపెనీ హార్వెస్టర్‌నే తీసుకోవాలనీ, నేను చెప్పిన కంపెనీ జేసీబీనే తీసుకోవాలని వత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. దీంతో అనుభవం లేని పనిలో రాణించలేమోనని లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎమ్మెల్యేల ఇష్టమే..
దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించి.. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలోని నాలుగు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలుచేసింది. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వంద మంది లబ్ధిదారుల ఎంపిక అధికారం ప్రభుత్వమే స్వయంగా ఎమ్మెల్యేలకు అప్పగించింది. లబ్ధిదారుల ఎంపికను ఇన్‌చార్జి మంత్రి అనుమతితో ఎమ్మెల్యేలే పూర్తి చేశారు. దీంతో రాజకీయ కోణంలోనే ఎంపిక జరిగిందన్న విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. అత్యంత పేదలను ముందుగా ఎంపిక చేయకుండా ఎమ్మెల్యే అనుయాయులకు మాత్రమే ఇచ్చారన్న చర్చ జరుగుతున్నది.
సాగదీత..
దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో అమలు చేసినంత వేగంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఐదారు నెలల కాలంలో ఇప్పటివరకు 24,046 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్ చేయగా.. 35,642 కుటుంబాలు లబ్దిపొందాయి. అయితే ఇందులో చాలా మందికి పైసలు, లబ్ధిదారులకు గ్రౌండింగ్ ఇంకా కాలేదు. దీన్ని బట్టి ఎన్నికల దాకా ఈ పథకాన్ని సాగదీస్తారేమోనన్న అనుమానాన్ని దళితులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా పథకం అమలు తీరులో ఎలాంటి కదలిక కనిపించటంలేదు. ఈ సారి ఒక్కో నియోజకవర్గానికి 1,500 మందికి చొప్పున ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్‌లో 17,700 కోట్లు కేటాయించగా, ఇటీవల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఒక్క అడుగూ ముందుకుపడలేదు.
మార్పుకు ప్రతిపాదనలు..
లబ్దిదారుల ఎంపికను ఇక నుంచి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వ అధికారులే చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు రూపొందించి వాటిని ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ప్రభుత్వం అంగీకరిస్తే.. అందుకు తగిన నిబంధనలను తీసుకొచ్చి ఆ ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వ అధికారులే లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది.