Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు పద్దతులపై జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయంలో యాంత్రీకరణను సంపూర్ణంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరముందని చెప్పారు. సాంకేతికతతో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. రైతులకు, ముఖ్యంగా పత్తిసాగుకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన 'అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు'లో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణ దిశగా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ను కోరినట్టు తెలిపారు. సాంప్రదాయ సాగునుంచి ప్రపంచ సాంకేతికతను తెలంగాణ వ్యవసాయానికి అన్వయించుకోవాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని వివరించారు. కేవలం అధిక మోతాదులో పంటలు పండించడమే కాదనీ, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని సూచించారు.తక్కువ పెట్టుబడితోపాటు రైతుకు రాబడినిచ్చే పంటలు ఎంపిక చేసుకోవాలని కోరారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించి రాష్ట్రంతోపాటు దేశ ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి, ఏ పంటలు వేయాలనే అంశంపై రైతులకు వివరించినట్టు తెలిపారు. ప్రపంచ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి కావడం లేదన్నారు. భారతదేశంలోనే 3.20 కోట్ల ఎకరాల్లో దేశంలో పత్తి సాగవుతున్నదని చెప్పారు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. చైనాలో 80 లక్షల ఎకరాల్లో, అమెరికాలో 75 నుంచి 80 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుండగా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో 18 నుంచి 50 లక్షల ఎకరాలలో పత్తి పండిస్తున్నారని చెప్పారు. బయటి దేశాల్లో పెద్ద, పెద్ద భూకమతాలు ఉండటం మూలంగా ఆయా దేశాలు వ్యవసాయ యాంత్రీకరణను సులువుగా అమలు చేయగలుగుతున్నారని వివరించారు. మన దేశంలో చిన్న, చిన్న భూకమతాలు ఉండటం వల్ల అది సాద్యం కావడం లేదన్నారు. సింగిల్ పిక్ పత్తి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని కోరారు. అదే సమయంలో రైతుల భూములు అధిక సాంద్రత పత్తి సాగుకు అనుకూలమా? లేదా? అన్నది నిర్ణయించుకోవాలన్నారు. దాని పంట సాగుకు అనుకూలమైన రైతులను మాత్రమే ప్రోత్సహించాలని సూచించారు. మొదటి వానకు కాకుండా రెండో వాన తర్వాతనే పత్తి సాగుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి పంట సాగు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం జరగాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.