Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కొల్లాపూర్' భూములపై రాజావారికి హక్కులేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
- నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
కొల్లాపూర్ సంస్థాన భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చే దాకా పోరాడుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. కొల్లాపూర్ రాజావారి భూముల సాగు రైతులకు పట్టాలివ్వాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అసద్‌పూర్ రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బలహీన వర్గాల హక్కులను కాపాడాల్సిన అధికారులు.. వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. నెల రోజులుగా బాధిత రైతు కుటుంబాలు ఉద్యమాలు చేస్తుంటే స్పందించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. కొల్లాపూర్ రాజా వారి పరిధిలో 2400 ఎకరాల భూమి ఉండగా.. 800 ఎకరాలు శ్రీశైలంలో మునిగిపోయాయని గుర్తు చేశారు. మిగతా భూమిని ఆదిత్య లక్ష్మణ్‌రావు తండ్రి ప్రభుత్వానికి సీలింగ్ యాత్రలో భాగంగా అప్పగించారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ముంపు భూములకు పరిహారం కూడా అందజేసిందన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన భూములను కొల్లాపూర్ రాజా కుటుంబం తిరిగి స్వాధీనం చేసుకొని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఎన్‌ఆర్‌ఐలకు అమ్మడం దారుణమన్నారు. ఆ భూముల్లో ఒక్క ఎకరంపై కూడా ఆయనకు హక్కు లేదని చెప్పారు. 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న రైతులు మొదటి నుంచీ రాజావారికి కప్పం చెల్లిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. సాగు భూములపై ఎలాంటి హక్కు లేని రాజావారు భూములు అమ్మడం ఏమిటని ప్రశ్నించారు. సాగులో ఉన్న రైతులను అటవీ, రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులు పెడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను ధిక్కరి స్తున్న రాజు లక్ష్మణ్‌రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజావారి 1600 ఎకరాల భూమిని వెంటనే బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులకు పంచి పెట్టాలన్నారు. అదే క్రమంలో అసద్‌పూర్ రైతులకు పట్టాలివ్వాలని, లేకుంటే అందరినీ సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతీలాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందికొండ గీత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య, నాయకులు నరసింహ, శివవర్మ తదితరులు పాల్గొన్నారు.