Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో కేసీఆర్ తీరు సరికాదు
- బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫ్రంట్‌గా ఏర్పడాలి
- ఎన్నికల తరువాత ఐక్యం కావాలన్నదే సీపీఐ(ఎం) ప్రత్యామ్నాయం
- సమస్యలను పక్కదారి పట్టిస్తున్న ముఖ్య మంత్రి: తమ్మినేని
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలతో సీఎం కేసీఆర్ కలిసిరాకపోవడంతో ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తున్నది.. టీఆర్‌ఎస్ తటస్థ వైఖరి బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుంది.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫ్రంట్‌గా ఏర్పడాలి.. అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవిగేశ్వర ఫంక్షన్ హాల్‌లో సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతుల్లో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించడంతోపాటు.. రాష్ట్రానికి నిధుల విడుదల పట్ల కేంద్రం అన్యాయం చేస్తున్నదని విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తటస్థ వైఖరి అవలంబించడం సరికాదన్నారు. అలా చేయడమంటే బీజేపీకి లాభం చేకూర్చడమేనని విమర్శించారు. కాంగ్రెస్ ఉంటే తాము రాలేమంటూ.. పరోక్షంగా బీజేపీకి సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ పునరాలోచించుకో వాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడం కోసం దేశ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, స్పందన బాగుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం కోసం అన్ని పార్టీలు కృషి చేయాలే తప్ప.. పార్టీల మధ్య ఉన్న సమస్యలను సాకుగా తీసుకొని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా ఉండొద్దని అన్నారు. ఎన్నికల ముందు ప్రాంతీయ పార్టీల కూటమి ఆలోచన చేయొద్దన్నారు. ఎన్నికల ముందు కూటమి కంటే ఎన్నికల తరువాత విపక్షాలు ఐక్యం కావాలన్నదే సీపీఐ(ఎం) ప్రత్యామ్నాయంగా సూచిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నికల పేరుతో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు తిష్టవేశాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పడమే కానీ అంతా డొల్లతనమని విమర్శించారు. పోడు భూముల సమస్యలను పట్టించుకోకుండా, పట్టాలు ఇవ్వకుండా సాగు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుందన్నారు. కొత్తవారికి రేషన్ కార్డులు, పింఛన్లు త్వరలో అని చెప్పడమేగానీ ఇచ్చేదెప్పుడని ప్రశ్నించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి వెబ్ సైట్‌లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పారు. తండ్రి పేరు మీద ఉన్న భూములను కొడుకుల పేరు మీద వారసత్వంగా ఎక్కించాల న్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గౌరవెల్లిలో ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా నిర్వాసితులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయిస్తే నిర్వాసితుల భూములు కోల్పోకుండా చేయొచ్చని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలికపై లైంగికదాడి ఘటనలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల కుమారులు ఉన్నారని ప్రచారం జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం ప్రకటన కూడా చేయకపోవడం దుర్మార్గమన్నారు. వరంగల్లు, హనుమకొండ జిల్లాల్లో పేదల ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలు ప్రయోగించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుంన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల మీద ఉద్యమాలను నిర్మించడానికి, వామపక్షాల ఐక్యత కోసం సీపీఐ(ఎం) ప్రయత్నం చేస్తుందని, ప్రజలు అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.