Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలా ఎవరు మాట్లాడినా తప్పే అన్న వ్యాఖ్యలపై ట్రోల్స్
- సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో భజరంగ్‌దళ్ ఫిర్యాదు
నవతెలంగాణ- సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్
గోరక్షణ పేరుతో బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ ప్రతి అంశాన్నీ వివాదాస్పదంగా మారుస్తున్నాయి. ఆవులను రవాణా చేస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. జై శ్రీరాం, జై.. జై శ్రీరాం అంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగడం వాటికి పరిపాటిగా మారింది. సామాన్యులపైనే కాదు రాజకీయ నాయకులను, ప్రముఖలను సైతం వదలడం లేదు. కొన్ని ప్రాంతాల్లో దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలావుండగా, కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని, ఇటీవల ఆవులను రవాణా చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడి ఘటనపై ప్రముఖ సినీ నటి సాయిపల్లవి స్పందించిన తీరును సైతం భజరంగ్ దళ్ వివాదాస్పదంగా మార్చింది. సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించిన 'విరాటపర్వం' సినిమా ప్రచారంలో భాగంగా ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నేపథ్యం గురించిన ప్రశ్నపై ఆమె స్పందించారు. లెఫ్ట్‌వింగ్, రైట్‌వింగ్ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్‌గా ఉంటానని చెప్పారు. 'దాడులు చేయడం, చంపడం, హింసించడం ఎవరు చేసినా తప్పే' అని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన భజరంగ్‌దళ్ సాయి పల్లవిని టార్గెట్ చేసింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ చర్చకు దారి తీశాయి. కొందరు అనుకూలంగా ఉండగా.. మరికొందరు ఆమె మాటలను వక్రీకరిస్తూ ట్రోల్ చేస్తున్నారు. విరాట పర్వం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సినీనటి సాయిపల్లవి గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్ రాష్ట్ర నేతలు శివరాములు, అభిషేక్ హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకెళ్తామని ఇన్‌స్పెక్టర్ పద్మ తెలిపారు.
సాయి పల్లవిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: కేవీపీఎస్
సినీ నటి సాయి పల్లవిపై సంఘ్ పరివార్ అరాచక శక్తులు బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయించడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి. స్కైలాబ్ బాబు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.ఆమె వామపక్ష, నాస్తికవాది కాదని తెలిపారు. ఆమె ఒక సాధారణ దైవ భక్తురాలని తెలిపారు. చంపడం, దాడులు చేయడం ఎవరు చేసినా తప్పేనంటూ వ్యాఖ్యానించినందుకు మతో న్మాద శక్తులు సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు, వీడియోలు, వాట్సప్ స్టోరీలు వైరల్ చేస్తున్నారని తెలిపారు.ఆమెకు రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అని వారు పశ్నించారు. ప్రశ్నించేవారిని ఆరెస్సెస్, బీజేపీ పరివారం వదిలిపెట్టటం లేదని పేర్కొన్నారు. దళితులను, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని ఆహారపు అలవాట్ల పేరుతో చంపుతున్నారనీ, హక్కుల కార్యకర్తలను, హేతువాదులను, జర్నలిస్టులను, ఎడిటర్లనూ చంపారని గుర్తు చేశారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక శక్తులు ఖండించాలనీ, సాయిపల్లవికి బాసటగా నిలవాలని వారు కోరారు.