Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సజావుగా సాగడం లేదనీ, అందువల్ల సీబీఐ దర్యాప్తు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో గురువారం పిల్ దాఖలైంది. బీజేపీ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీయు మహేందర్ ఈ పిల్ వేశారు.ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ, కేంద్ర, రాష్ట్ర హోం శాఖలు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, జూబ్లీహిల్స్ స్టేషన్ హౌస్ అధికారులను పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే కుమారుడే ప్రధాన నిందితుడనీ,వారికి మార్యాదలు చేస్తూ బిర్యానీలు సరఫరా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందనీ, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపులు లోపభూయిష్టం:హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఏపీకి కేటాయించటమనేది చెల్లుబాటుకాదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కేంద్ర సర్వీస్ అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫార్సులన్నీ తప్పులతడకగా ఉన్నాయని ఏజీ బీఎస్‌్ ప్రసాద్ వాదించారు. అందుకే ఆ కమిటీ సిఫార్సులను సవాల్ చేసిన పలువురు కేంద్ర సర్వీస్ అధికారులకు కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఊరట లభించిందన్నారు. ఆ ఉత్తర్వులను కేంద్రం హైకోర్టులో సవాలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం వేసిన పిటిషన్లను జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ నందలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఏజీ వాదిస్తూ, సోమేష్‌కుమార్‌ను తెలంగాణలో కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందన్నారు.ఈ నేపథ్యంలో కేంద్రం ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాలతో సంప్రదించకుండా కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపులు చేపట్టటం సబబుకాదన్నారు.ఈ క్రమంలో కేంద్ర వాదనల కోసం హైకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.