Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విజయవాడ రైల్వే డివిజన్‌లో సరుకు రవాణా రైళ్ల సమయపాలన మెరుగుదలకు మరింత కృషి చేయాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(ఇన్‌చార్జి) అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. గురువారం విజయవాడలోని డివిజినల్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ.. సరుకు రవాణా రంగంలో గతేడాదితో పోలిస్తే పనితీరు మెరుగైనందుకు అధికారులను అభినందించారు. కీలక ప్రాంతాలలో ఆర్‌యూబీ నిర్మాణ పనులు, ఎల్‌సీ గేట్ల తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. మచిలీపట్నం యార్డ్ పునర్నిర్మాణం, అరవల్లి, నిడదవోలు మధ్య డబ్లింగ్, గూడూరు-విజయవాడ మూడో రైల్వే లైన్, రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద ప్లాట్‌ఫారం 4, 5 ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రైల్వే ఆస్తులు నష్టపోకుండా వాటి సంరక్షణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి రైళ్ల సమయపాలన మెరుగుదలకు కృషి చేయాలన్నారు. భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా తగు చర్యలను చేపట్టాలని ఆదేశించారు. నిరంతరం ట్రాక్ పటిష్టతకు తగిన తనిఖీలు నిర్వహించాలనీ, దీనిద్వారా ఎప్పటికప్పుడు అత్యవసర సమయాలలో తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. సరుకు రవాణాలో సిమెంట్, బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాలు వంటి లోడిరగ్‌కు కృష్ణపట్నం, కాకినాడ పోర్టుతో సహా అన్ని ముఖ్య లోడిరగ్ ప్రాంతాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. సెక్షన్‌లో టెర్మినల్‌లో రద్దీని తగ్గించి రవాణాలో అడ్డంకులను తొలగించి వ్యాగన్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించేందుకు కృషి చేయాలన్నారు. సమీక్షలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ ఆర్.ధనంజనేయులు, దక్షిణ మధ్య రైల్వే రోడ్ సేఫ్టీ వర్క్స్ చీఫ్ ఇంజినీర్, జి.వి.రమణారెడ్డి పాల్గొన్నారు.