Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాల్గో రోజూ బాసర విద్యార్థుల ఆందోళన
- ట్రాక్టర్‌పై వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
- గోడదూకి ఐటీ ప్రాంగణంలోకి..
- స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- విస్తృత తనిఖీలు, ఎక్కడికక్కడ నాయకుల అరెస్ట్
- ప్రధాన గేటు వద్ద మూడంచెల భద్రత
నవతెలంగాణ-బాసర
సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాల్గో రోజూ తమ నిరసన కొనసాగించారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనకు వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసులు శుక్రవారం ట్రిపుల్ ఐటీని దిగ్బంధించారు. ప్రధాన గేటు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరో పక్క విద్యార్థులు ఎండను సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బాసర గోదావరి బ్రిడ్జి నుంచి ముధోల్ వరకు, మహారాష్ట్ర సరిహద్దు బీదరెల్లి వరకు పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి బోధన్ మీదుగా మహారాష్ట్రలోని బాలాపూర్ గ్రామం మీదుగా పంట చేల నుంచి టాక్టర్‌పై ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. పోలీసుల కండ్లుగప్పి గోడ దూకి యూనివర్సిటీలోకి ప్రవేశించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలుపుతానని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా రేవంత్‌రెడ్డిని పోలీసు వాహనంలో లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరును బిక్కనూర్ టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం నుండే పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. కనిపించిన వివిధ పార్టీల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. యూనివర్సిటీ డైరెక్టర్ సతీష్‌కుమార్ విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 12డిమాండ్లను పరిష్కరించాలని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యూనివర్సిటీని సందర్శించాలని విద్యార్థులు ముక్తకంఠంతో కోరారు.
ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు
ట్రిపుల్ ఐటీకి రాజకీయ పారీలు, విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారం మేరకు ప్రత్యేకంగా భద్రత పెంచారు. గోదావరి బ్రిడ్జి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. తమ పిల్లలను చూసుకునేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను బ్రిడ్జి వద్దనే పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. రాజకీయ పార్టీల నాయకులను సైతం బాసరలోకి అనుమతించలేదు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలపడానికి వెళుతున్న కాంగ్రెస్ ఏఐసీసీ కార్యక్రమాల అమలు చైర్మెన్ మహేశ్వర్‌రెడ్డిని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌కుమార్‌ను, జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి తదితర నాయకులు, కార్యకర్తలను దిలావర్‌పూర్ టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు నర్సాపూర్(జి) పోలీస్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.