Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి, ప్రజలకు చేసిన ఉపకారం లేదు
- రైతన్నలను, సిఫాయిలను రోడ్డుకీడ్చారు
- జై జవాన్, జై కిసాన్ కాస్తా నై జవాన్, నై కిసాన్
- నిజామాబాద్ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దేశానికి, ప్రజలకు చేసిన ఉపకారమేమీ లేదని, ఆ పార్టీదంతా ప్రచారం.. అపచారమని వైద్యారోగ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తెచ్చి ఉరితాళ్లు బిగించారని, ఇప్పుడు 'అగ్నిపథ్' పేరిట ఆర్మీ అభ్యర్థులను రోడ్లపైకి తెచ్చారని చెప్పారు.నిజామాబాద్ జిల్లాలో శనివారం మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడంతో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ముందుగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో పీహెచ్సీ ప్రారంభం, బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూను ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్యరోగ్యశాఖ అధికారులతో, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. అంతకముందు భీంగల్‌లో బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. బీజేపీ, కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అచ్చేదిన్ కేవలం నోటిమాటకే పరిమితమైందన్నారు. 'బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో ఏమిచ్చింది? దేశానికి మొండిచేయి చూపింది. అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. ప్రజలను మోసం చేసింది. ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ చేయలే. రూపాయి, సిపాయి విలువ తగ్గించారు. డాలర్ రేటుతో పోల్చితే ఏనాడూ లేనంతగా రూపాయి మారకం విలువ తగ్గింది. 'అగ్నిపథ్'తో సిఫాయిల విలువ తగ్గించారు. అగ్నిపథ్‌లో నాలుగేండ్లు జీతం ఇస్తారట. ఉద్యోగ భద్రత, భవిష్యత్తు భద్రత లేదు. దేశం కోసం ప్రాణం త్యాగం చేసే సైనికుల విలువను బీజేపీ సర్కారు తగ్గించింది' అని విమర్శించారు. 'జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని అపహస్యం చేస్తున్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఉరితాళ్లు పెట్టారు. అగ్నిపథ్‌తో జవాన్లను రోడ్డు మీదకు తెచ్చారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని నై జవాన్, నై కిసాన్‌గా మార్చారు' అని ఎద్దేవా చేశారు. బీజేపీ సర్కారు ప్రజల ఉసురుపోసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తేసి సిలండర్ ధర ఏకంగా వెయ్యి దాటించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పండించిన వడ్లు కొనండయ్యా అంటే నూకలు తినండని అవమానపరిచిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘం రద్దు చేసి నీతి ఆయోగ్‌తో దేశం ఉద్దరిస్తామన్నారు.. చివరకు ఆ నీతి ఆయోగ్ చెప్పింది కూడా వినడం లేదని విమర్శించారు. మిషన్ కాకతీయ, భగీరథకు రూ.20 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే.. కేంద్ర సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఆకుల లలిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎల్ ఎం బి.రాజేశ్వర్, నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.