Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరచూ కొరతకు అదీ కారణమే
- అవసరాలను గుర్తించడంలో అధికారుల వైఫల్యం
- టీఎస్ఎంఐడీసీ నిర్వాకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచుతున్నాం. ఒకసారి ఆస్పత్రికి వచ్చి డాక్టర్‌కు చూయించుకుంటే ఆ ఆస్పత్రి ఫార్మసీలోనే అన్ని మందులు తీసుకోవచ్చు. అదే విధంగా సర్జికల్ తదితర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాం....' ఇవి తరచుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఉన్నతాధికారులు చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. డాక్టర్లు రాసిన కొన్ని మందులు దొరకకపోవడంతో బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఒకవైపు ప్రభుత్వం మందులకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నప్పటికీ కింది స్థాయిలో సమయానికి రోగులకు ఔషధాలు దొరక్కపోవడానికి అధికారుల వైఫల్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడువు దగ్గరగా (ఎక్స్పైరీ డేట్ త్వరగా అయిపోయే) మందులను కొనుగోలు చేయడమే తరచూ కొరత ఏర్పడ్డానికి కారణమనే వాదన వినపడుతున్నది.
ప్రభుత్వాస్పత్రులకు కావాల్సిన మందులను తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. మందుల సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ ఇండెంట్ పెట్టే విధానాన్ని తీసుకొచ్చారు. దీని కోసమే ప్రత్యేక ఈ-ఔషధి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్ పంపిణీ, వాటి ఆడిటింగ్ జరిగిపోతుంది. 2015 జూన్ నుంచే ఈ సాఫ్ట్‌వేర్‌ను జిల్లా కేంద్రాలతో అనుసంధానించారు. తద్వారా ప్రతి ఔషధం, సర్జికల్ సేకరణ, సరఫరాపై క్షేత్రస్థాయిలో పని చేసే మెడికల్ ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అవగాహన కలిగి ఉంటారు. దీంతో మందుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే వీలుంటుంది.
రాష్ట్ర స్థాయిలో గతంలో టీఎస్ఎంఐడీసీలో క్వాలిటీ మేనేజర్‌తో పాటు సంబంధిత ఫార్మకాలజీ లేదా ఇతర విద్యనభ్యసించిన నిపుణులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆ పోస్టులు ఖాళీగా ఉండగా, డీఎంఈ నేతృత్వంలోని కమిటీనే వీటిని పర్యవేక్షిస్తుండటంతో లోపాలు చోటు చేసుకుంటున్నాయని ఆ శాఖలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఎల్ 1 టెండర్ల ప్రక్రియలో సవరణలు చేయాలనే సూచనలు వస్తున్నాయి. గడువు తీరడానికి మూడు నెలల ముందే ఈ-ఔషధి అప్రమత్తం చేస్తున్నప్పటికీ, వాటిని తిరిగి పంపించడంతో పాటు కొత్త మందులు ఆస్పత్రులకు రావడానికి సమయం తీసుకుంటున్నది. దాని కన్నా గడువు ఎక్కువగా ఉన్న మందులను కొనుగోలు చేస్తేనే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మంత్రి సీరియస్....
ఇటీవల మందుల కొరత అంశం రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో చర్చించారు. సరఫరా వ్యవస్థలో లోపాలున్నట్టు గుర్తించారు. ఇ-ఔషధిని పకడ్బందీగా ఉపయోగించుకోవడం లేదని ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్టు సమాచారం. ప్రభుత్వాస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లను సైతం ప్రభుత్వ ఫార్మసీలో తనిఖీలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఫార్మసీలో పని చేసే సిబ్బందికి ఈ-ఔషధి ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు.