Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాథలైన చిన్నారులు
- దేవుడమ్మ వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-కొత్తగూడెం
వేధింపులు తట్టుకోలేక భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో సోమవారం సంచలనం రేపింది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లోతు వాగు పంచాయతీ పరిధిలోని మాదిగ ప్రోలు గ్రామంలో నివాసం ఉంటున్న కంగనాల వెంకటేష్ (33) కంగనాల రాణి (30)లకు అదే గ్రామానికి చెందిన దేవుడమ్మ అలియాస్ నరేష్ కుటుంబం పరిచయమైంది. నరేష్ జ్యోతిష్యం చెప్పడం, పూనకం చేయడం లాంటివి చేస్తూ జీవిస్తున్నాడు. కాగా, వెంకటేష్‌కు నరేష్ రూ.10 వేలు ఇచ్చాడని, వాటిని తిరిగి చెల్లించాలని పలు దఫాలుగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక వెంకటేష్ దంపతులు ఇటీవల జూలూరుపాడులోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడతో నరేష్ జూలూరుపాడుకు తన అనుచరులతో వెళ్లి వెంకటేష్‌పై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సొంత గ్రామానికి చేరుకున్నారు. నరేష్ వేధింపులు పెరగడంతో దంపతులు ఇద్దరు శుక్రవారం గడ్డి కలుపు మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి భార్య రాణి శనివారం చనిపోగా, వెంకటేష్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. వీరికి 10 ఏండ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో వారు అనాథలయ్యారు. నరేష్ వేధింపుల వల్లే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.