Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న సాగర్ ప్రాజెక్టు సీఈ కార్యాలయం ముట్టడి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలని, ఈనెల 27న నల్లగొండ సాగర్ ప్రాజెక్టు సీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే అసోసియేషన్ భవనంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. లిఫ్టులకు వెంటనే మరమ్మతులు చేయాలని, ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన లిఫ్టుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలన్నారు. ఆ మేరకు గతంలో ఒప్పందాలు జరిగాయన్నారు. ఎడమ కాలువ పరిధిలో 54 లిఫ్టులు ఉన్నాయని, ప్రభుత్వాలు మారిన తర్వాత నిర్వహణ బాధ్యతలు ఆయా శాఖలకు మార్చి రైతులను ఇబ్బందికి గురి చేశారని విమర్శించారు. అవగాహన లేని ఇరిగేషన్ శాఖకు లిఫ్టుల బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. లిఫ్టుల్లో మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి అధ్వానంగా ఉన్నాయని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్టులు 60 వేల ఎకరాల కూడా నీరు అందించడం లేదని తెలిపారు. లిఫ్టులు మరమ్మతులకు నోచుకోక, కింది వరకు నీళ్లు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. వెంటనే లిఫ్టులను మరమ్మతులు చేపట్టాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. పూర్తి నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం లిఫ్ట్ రైతులు మరో ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈనెల 27న ప్రాజెక్టు సీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, రైతులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రైతు సంఘం ప్రతినిధులు, లిఫ్టు నిర్వాహకులు, చైర్మెన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డబ్బికార్ మల్లేష్, వెంకటేశ్వరరావు, చంద్రయ్య, శశిధర్‌రెడ్డి, పాల్వాయి రాంరెడ్డి, వలి, రామారావు తదితరులు పాల్గొన్నారు.