Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవో కేంద్రసంఘం తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల మరణించిన ఆ సంఘం మాజీ అధ్యక్షులు బి స్వామినాథం చిత్రపటానికి టీఎన్జీవో మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్, డి సుధాకర్‌తోపాటు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ సహా నాయకులు ఈ సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించారు. సమావేశ మందిరానికి స్వామినాథం మెమోరియల్ హాల్‌గా నామకరణం చేశారు. కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. పీఆర్సీ ఆమోదించిన అనేక అంశాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాలని కోరారు. నూతన జిల్లాలకు అనుగుణంగా కొత్త క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) 2018 నుంచి అమల్లో ఉన్నా కుంటుపడిందనీ, ఉద్యోగుల చందాతో కూడిన ఈహెచ్ఎస్ను అమలు చేయాలని తెలిపారు. అన్ని జిల్లాల్లో టీఎన్జీవో భవనాలకు స్థలాలు కేటాయించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో పనిచేస్తున్న 123 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సవరించాలని తెలిపారు. పీఆర్సీలో ఉన్న లోపాలను సవరించడానికి అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గచ్చిబౌలి ఉద్యోగుల ఇండ్లస్థలాలను టీఎన్జీవోలకు కేటాయించేందుకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమో 1088ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. 317 జీవో ద్వారా జరిగిన వ్యత్యాసాలు, అప్పీళ్లను, పరస్పర బదిలీలకు సంబంధించిన చర్యలు తీసుకోవాలనీ, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోటా రాజేశంగౌడ్, ఎం సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావుతోపాటు అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.